చక్కెర ఫ్యాక్టరీ సాధనకై దీక్ష

చక్కెర ఫ్యాక్టరీ సాధనకై దీక్ష
  • ఫ్యాక్టరీ తెరిచే వరకు పోరాటం ఆగదు 
  • కొండగట్టులో దీక్ష బూనిన రైతులు

ముద్ర, మల్యాల: ముత్యం పేట చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలంటూ రైతులు, సాధన సమితి సభ్యులు దీక్ష పట్టారు.  బుధవారం  కొండగట్టులో అంజన్న కు తలనీలాలు సమర్పించిన రైతు నాయకుడు మామిడి నారాయణ రెడ్డి చక్కెర ఫ్యాక్టరీని తెరిపించే వరకు చెప్పులు ధరించకుండా, గడ్డం, తల వెంట్రుకలు తీయకుండా, మద్యం, మాంసం ముట్టకుండా దీక్ష కొనసాగిస్తానని ప్రతిన బూనారు. గ్రామంలోని రైతులను చైతన్య పరుస్తానని నారాయణరెడ్డి పేర్కొన్నారు.  ప్రతిసారి ఎన్నికల సమయంలో రైతులకు ఫ్యాక్టరీ తెరిపిస్తామని నాయకులు హామీఇస్తూ మోసగిస్తున్నారని వారి కళ్ళు తెరిపించాలని అంజన్నను కోరినట్లు తెలిపారు. చక్కెర ఫ్యాక్టరీ సాధన సమితి నాయకుడు చెన్నమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, జగిత్యాల జిల్లా తో పాటు నిజామాబాద్ జిల్లా రైతులకుఅందుబాటులో ఉండే ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ మూత పడటం వల్ల రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు.

ఉపాధి లేక ఎంతో మంది గల్ఫ్ బాట పట్టి పడరాని పాట్లు పడుతున్నారన్నారు. రైతులను జాగృతం చేసేందుకు గ్రామ గ్రామాన పర్యటిస్తామని సాధన సమితి నాయకులు పేర్కొన్నారు. వీరి ఉద్యమానికి గల్ఫ్ జేఏసీ రాష్ట్ర నాయకుడు గుగ్గిల్ల రవి గౌడ్ మద్దతు ప్రకటించారు.  ఈ కార్యక్రమంలో సాధన సమితి నాయకులు చెన్నమనేని శ్రీనివాసరావు, రైతు నాయకులు వాకిటి సత్యం రెడ్డి, గురిజల రాజి రెడ్డి, పన్నాల తిరుపతి రెడ్డి, కంది బుచ్చి రెడ్డి, ప్రవీన్, కొత్తపేట గంగారెడ్డి, అనీల్ తోపాటు పలువురు ఉన్నారు.