రెండు నియోజకవర్గాల్లో  బీఆర్​ఎస్​కు తలనొప్పిగా మారిన  వర్గపోరు 

రెండు నియోజకవర్గాల్లో  బీఆర్​ఎస్​కు తలనొప్పిగా మారిన  వర్గపోరు 

నాగర్ కర్నూల్ ముద్ర ప్రతినిది: నాగర్ కర్నూల్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‍ ఎమ్మెల్యేలకు వర్గపోరు మొదలైంది.  ఆ జిల్లాలో బిఆర్ఎస్‍ పార్టీలో అసమ్మతి గళాలు  పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్‍ ఎమ్మెల్యేలకు సొంత పార్టీలో  అపోజిషన్‍ వర్గం నాయకులు  చుక్కలు చూపిస్తున్నారట. మరో సారి సిట్టింగ్‍ లకే టిక్కెట్టు అన్న గులాబీ  బాస్‍ ప్రకటనతో  ఇన్నాళ్లు టిక్కెట్టు దక్కుతుందని ఎదురు చూసిన ఆశావాహులు అసంతృప్తి జ్వాలలు వినిపిస్తున్నారట. ఒక్కొక్కరుగా తమ నిరాశను వెళ్ళగక్కతూ వేరు కుంపటి పెట్టి కారు  పార్టీలో సెగలు నింపే  పనిలో  నిమగ్నమయ్యారట. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో  ప్రతిపక్ష పార్టీలను ఎలా ఎదుర్కొవాలన్న ఆలోచన ఉన్న సిట్టింగ్‍ ఎమ్మెల్యేలకు సొంత పార్టీలోని తమ నేతల నుంచి ఎదురవుతున్న  వర్గపోరును తగ్గించుకోలేక తలలు పట్టుకుంటున్నారట.

 హ్యాట్రిక్​సాధించాలనే  నేతలకు గండం తప్పదా ...?

 నాగర్ కర్నూల్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు హ్యాట్రిక్​ సాధించాలని గట్టి ప్రయత్న మే  చేస్తున్నట్లు  చెప్పవచ్చు. కానీ అదే పార్టీకి చెందిన నేతల తనయులు పార్టీలోకి రావడంతో  ప్రస్తుత ఎమ్మెల్యేలకు యువనేతల గండం తప్పదు అని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. నాగర్ కర్నూల్  నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ టికెట్ తనకే దక్కుతుందని భావించి  క్షేత్రస్థాయిలో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతుండడంతో  పసిగట్టిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గుడ్ మార్నింగ్ నాగర్ కర్నూల్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తుంది. గ్రామాలలోని సమస్యలపై ప్రజలు నిలదీయడంతో ఒకవైపు ఆందోళన చెందుతున్నా  బయటికి మాత్రం గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది.  మరోవైపు రాజేష్ రెడ్డి వేరు కుంపటిగా ఎన్నికల బరిలో ఉంటే ఎన్నికలు రసవత్తరంగా మారే ప్రమాదం ఉండడంతో  బీఆర్​ఎస్​ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీలో కుటుంబ కలహాలు సహజమేనని అంటూ ఆయన వర్గాన్ని కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం లో ఉన్నట్లు తెలుస్తోంది. 

 అచ్చంపేట నియోజకవర్గంలో ఎంపీ రాములు కుమారుడు –ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొనడంతో నియోజకవర్గంలోని క్యాడర్ ఎవరి వైపు వెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.  అచ్చంపేట నియోజకవర్గ జడ్పీ చైర్మైన్‍ ఎన్నిక సందర్భంగా  ఎంపి రాములు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మధ్య వివాదం రాజుకుంది. ఎంపి రాములు కుమారుడు భరత్‍ కు జడ్పీ చైర్మన్‍ పదవి రాకుండా అడ్డుకున్నారన్న  కారణంతో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై ఎంపి రాములు సమరం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో గువ్వల ఓటమే లక్ష్యంగా ఎంపి రాములు, ఆయన కుమారుడు భరత్‍ కుమార్ అచ్చంపేటలో తమ క్యాడర్​ను   పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారని  తెలుస్తోంది.    రెండు అసెంబ్లీ  నియోజకవర్గాలైన  నాగర్ కర్నూల్, అచ్చంపేట లోని ఎమ్మెల్యేలు ప్రస్తుతం సొంత పార్టీలోనే వర్గపోరు తప్పదని చర్చించుకుంటున్నారు . ఇక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇంకా ఎన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‍ పార్టీలో ఎంత మంది వర్గపోరుకు తెరలేపుతారో వేచిచూడాల్సిందే.  ఇదిలా ఉండగా నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ నియోజకవర్గం లో బరిలో ఉంటే తన  విజయం సులభంగా  సాధ్యమవుతుందని  ప్రస్తుత ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గట్టి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.  అంతేకాకుండా  నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ వచ్చేలా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా  ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏదిఏమైనాప్పటికీ  నియోజకవర్గంలో రాజకీయం మాత్రం రసవత్తరంగా మారింది.