అర్హులంద‌రికీ రెండుగ‌దుల ఇందిర‌మ్మ ఇండ్లు

అర్హులంద‌రికీ రెండుగ‌దుల ఇందిర‌మ్మ ఇండ్లు
  • ప్ర‌భుత్వం వ‌చ్చిన తొలి ఏడాదిలోనే 2 ల‌క్ష‌ల కొలువుల భ‌ర్తీ
  • ప్రజల సమస్యలు వింటూ , సమస్యలన్నిటిని తీరుస్తామని హామీ ఇస్తూ, ప్రజల స్వాగతంకు పులకరిస్తూ ప్రేమతో ఇచ్చిన జొన్న రొట్టెలు తింటూ కోలాటాలు నృత్యలతో ఆహ్లాదంగా సాగిన పీపుల్స్ మార్చ్

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:-అర్హులైన పేదలందరికీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు గదులతో సొంత ఇల్లు, నిరుద్యోగులకు తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల నియామకం చేపడతామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా 13వ రోజు సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం బీబీ గూడెం నుంచి ప్రారంభమై కొండలరాయన గూడెం మున్యా నాయక్ తండ రాజ్ తండా, పాండే నాయక్ తండ మోదిన్పురం తిమ్మాపురం చందుపట్ల గ్రామ శివారు వరకు కొనసాగింది ఈ సందర్భంగా మండలంలో పీపుల్స్ మార్చ్ కు  ప్ర‌జ‌లు భారీ సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. రోడ్డు ప‌క్క‌నే సీఎల్పీ నేత విక్రమార్కకు, మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి గిరిజన మహిళలు రొట్టెలు కాల్చి  పెట్టి  కాంగ్రెస్ రావాలంటూ ప్రజలు హారతులు ఇచ్చి నృత్యాలతో కోలాటాలతో ఒక సంతోషకరమైన వాతావరణంలో పాదయాత్ర కొనసాగింది. 

భ‌ట్టి విక్ర‌మార్క‌కు,దామన్నకు ఆయా గ్రామాలు గిరిజన తండాల గ్రామస్తులందరూ  ఎదురేగి వెళ్లి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.చిన్న పిల్ల‌ల నుంచి పండుముస‌లి వ‌రకు.. గ్రామంలోని ప్ర‌తి ఒక్క‌రూ పాద‌యాత్రలో పాల్గొన్నారు. గ్రామం మొద‌లు నుంచి చివ‌రి వ‌ర‌కూ ఆట‌పాట‌ల‌తో కోలాట‌ల‌తో పాద‌యాత్ర‌ కొనసాగింది .ఈ సంద‌ర్భంగా వారితో పాటు అక్క‌డున్న గ్రామ‌స్తులంతా మూకుమ్మ‌డిగా భ‌ట్టి విక్ర‌మార్క, దామోదర్ రెడ్డిల‌తో గ్రామ స‌మ‌స్య‌లు చెప్పారు. చ‌దువుకున్న బిడ్డ‌ల‌కు కొలువులు లేవు,ఇండ్లు లేవు,గ్యాస్ ధ‌ర కొనేట్లుగాలేదు,భూములు లేవు, బ‌తికేందుకు ఉపాధి అవ‌కాశాలు లేవంటూ పలు సమస్యలను విన్నవించడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే గ్రామీణ ప్రజలకు గిరిజన వాసులకు మొత్తంగా తెలంగాణ ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటామని విక్రమార్క హామీ ఇచ్చారు.

సమస్యలను విన్నవించిన ప్రజలతో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ వ‌చ్చేది ఇందిర‌మ్మ రాజ్య‌మే ఆని ,కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే అధికారం చేపడుతుందని,అప్పుడు అర్హ‌త క‌లిగిన ప్రతి ఒక్క‌రికీ రెండు గ‌దుల ఇందిర‌మ్మ ఇండ్లు క‌ట్టుకునేందుకు రూ. 5ల‌క్ష‌లు,వంద రోజులు ప‌నికి వెళ్లే వారికి, నిరుపేద కూలీల‌కు ఏడాది రూ.12 వేలు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. అంతేకాక ఇంట్లో ఉండే ఇద్ద‌రు ముస‌ల‌వ్వ‌కు,తాత‌కు వృద్ధాప్య ఫించ‌న్ ఇస్తామ‌ని, ప్ర‌భుత్వం వ‌చ్చిన తొలిఏడాదే 2 ల‌క్షల ఉద్యోగాలు భ‌ర్తీచేస్తామ‌ని స్ప‌ష్టంగా చెప్పారు. నిరుద్యోగుల‌కు నెల‌కు రూ. 4 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు.ఎస్పారెస్పీ కాలువ ప‌రిశీల‌న‌ చేస్తూ మున్యానాయ‌క్ తాండా నుంచి పాద‌యాత్ర‌గా వ‌స్తున్న స‌మ‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్మించిన ఎస్సారెస్పీ నీటి కాలువ‌ను విక్ర‌మార్క,దామన్న ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తులు సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌తో మాట్లాడుతూ నాటి కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌ల‌య‌జ్ఞంలో భాగంగా నిర్మించిన కాకాతీయ కాలువ ఎక్స్ టెన్ష‌న్ ఫేజ్ 2 కాలువ ద్వారా నీళ్లు వ‌స్తున్నాయ‌ని చెప్పారు.