భారీ వర్షాలకు కూలిన గోడ

భారీ వర్షాలకు కూలిన గోడ
  • నిండు గర్భిణీకి తీవ్ర గాయాలు
  • శిశువు మృతి, తల్లి పరిస్థితి విషమం

ముద్ర ప్రతినిధి, మెదక్: భారీ వర్షాలకు మెదక్ పట్టణం మిలిటరీ కాలనీలో ఇల్లు కూలి గర్భిణీపై పడడంతో శిశువు మృతి చెందింది. తల్లి తలతో పాటు కాలుకు తీవ్ర గాయాలయ్యాయి.  ఆమె తల్లి కూడా గాయపడింది. కాలనీకి చెందిన మహమ్మద్ సర్వర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. భార్య చాంద్ సుల్తానా, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మొదటి కూతురు యాస్మిన్ ను సిద్దిపేటకు ఇవ్వగా మొదటి కాన్పు కోసం మెదక్ వచ్చింది. భారీ వర్షాలకు ఇంటి పైకప్పుతో పాటు గోడ కూలింది. నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి గర్భిణీ కడుపుపై పడడంతో ఆమె తల, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. అప్పటికే కడుపులో శిశువు మృతి చెందినాట్లు వైద్యులు నిర్ధారించారు. ఆపరేషన్ చేసి శిశువును తొలగించినట్లు కుటుంబీకులు తెలిపారు. తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారన్నారు. కాగా ఆమె తల్లి చాంద్ సుల్తానాకు సైతం గాయాలయ్యాయి. మెదక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.


ఎమ్మెల్యే పద్మ పరామర్శ 

ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మిల్ట్రీ కాలనీ సందర్శించి ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ప్రమర్శించారు. అన్ని విధాలా అనుకుంటామని హామీ ఇచ్చారు. గృహలక్ష్మిలో మూడు లక్షలు మంజూరు చేయిస్తానని తెలిపారు. గర్భిణి ప్రసవం కోసం హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడారు.