అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
  • పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ
  • ఈద్గా ప్రారంభోత్సవంలో హోమ్ మంత్రి మహమూద్ అలీ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తెలంగాణలోని సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి వర్గాన్ని అభివృద్ధి బాటలు నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. అభివృద్ధిలో పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ నిలిచిందన్నారు.రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన పునరుద్ఘాటించారు.  నిర్మల్ జిల్లాలోని చించోలి సమీపంలో నూతనంగా నిర్మించిన ఈద్గా ను మంగళవారం  సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి అన్ని వర్గాల్లోని పేదలకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని వీటివల్ల వారి జీవితాలు మెరుగవుతున్నాయని అన్నారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధికి చిరునామాగా మారిందని అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ కోట్లాది రూపాయలను వెచ్చిస్తోందని అన్నారు. ఈద్గా ప్రారంభోత్సవానికి వందలాది కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన హోమ్ మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు.

అంతకుముందు  అటవీ శాఖ కార్యాలయం లో పుష్పగుచ్చం  అందించి  స్వాగతం పలికిన  వారిలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,  జడ్పిఛైర్పర్సన్ విజయలక్ష్మి రాంకిషన్, జిల్లా పాలనాధికారి  వరుణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్ తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.