2 వేల నోట్లు 50 శాతం  వెనక్కి వచ్చేశాయ్!

2 వేల నోట్లు 50 శాతం  వెనక్కి వచ్చేశాయ్!
  • రూ.500 నోట్లను రద్దు చేయం
  • రూ. 1000 నోట్లను ప్రవేశపెట్టం
  • ప్రజలు వదంతులు నమ్మొద్దు
  • ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంతాదాస్​

న్యూఢిల్లీ: చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లలో 50 శాతం నోట్లు వెనక్కి వచ్చేశాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్​ పేర్కొన్నారు. గురువారం 2024 ఆర్థిక సంవత్సరం కోసం రెండో ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆయన మాట్లాడారు. నోట్ల రద్దు ప్రకటించిన 20 రోజుల్లోపే 50 శాతం నోట్లు వెనక్కి వచ్చాయన్నారు. ఇప్పటివరకు వెనక్కి వచ్చిన ఈ 50 శాతం నోట్ల విలువ రూ.1.82 లక్షల కోట్లని వెల్లడించారు. వీటిలో దాదాపు 85 శాతం ఓట్లు బ్యాంకుల్లో డిపాజిట్​చేయడంతోనే వచ్చాయని దాస్ పేర్కొన్నారు. మార్చి 31 నాటికి రూ.2 వేల నోట్లు రూ.3.62 లక్షల కోట్లు చలామణిలో ఉన్నట్లు వివరించారు. చివరి సమయంలో నోట్లు డిపాజిట్ లేదా మార్చుకోవడం చేయొద్దని సూచించారు. నోట్ల మార్పిడి కోసం రిజర్వ్ బ్యాంక్‌లో సరిపడా కరెన్సీ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. మరోవైపు రూ.500 నోట్లను కూడా రద్దు చేస్తారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ 5 వందల నోట్లు మార్చే ఆలోచనేదీ లేదన్నారు. ప్రజలు వదంతులను నమ్మవద్దన్నారు. రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టబోమని స్పష్టం చేశారు. మే 19న ఆర్బీఐ చలామణి నుంచి రూ.2,000 కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.