బీఆర్ఎస్ కేబినెట్ లో 90 శాతం చంద్రబాబు టీడీపీలో ఉన్నవారే..

బీఆర్ఎస్ కేబినెట్ లో 90 శాతం చంద్రబాబు టీడీపీలో ఉన్నవారే..
  • బీఆర్ఎస్ చంద్రబాబు వారసత్వ పార్టీ.. 
  • చంద్రబాబు డైరెక్షన్ లోనే బీ ఆర్ ఎస్ నడుస్తోంది: ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాహుల్ గాంధీ కి ఎడ్లు తెలియవు.. ఎవుసం తెలియదన్న కేటీఆర్ వ్యాఖ్యల పై.. ఎడ్లు.. ఎవుసం నీకు తెలుసా.. అని కేటీఆర్ ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు..మీలాగా  వాస్తవాలను వక్రీకరించడం రాహుల్ గాంధీ కి తెలియదనీ, పూటకో మాట మాట్లాడేవాడిని నువ్వు అని కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో సోమవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ కేటీఆర్ జగిత్యాల పట్టణ సందర్శన సందర్భంగా రాహుల్ గాంధీ పై విమర్శలు చేయడం పై స్పందిస్తూ రాహుల్ గాంధీ ఎక్కడా..నువ్వు ఎక్కడ..అని కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉచిత విద్యుత్ ప్రారంభించిన్నప్పుడు, కేటీఆర్ కు కనీసం ఉచిత విద్యుత్ అంశం పై అవగాహన అయినా ఉందా..ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు కేటీఆర్ ఎక్కడ ఉన్నావు. ఉపాధి కోసం విదేశాల్లో ఉన్నావనీ మరిచి పోయావా అన్నారు. మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని కేటీఆర్ ను హెచ్చరించారు.  

జూన్ 26 నుండి రోజుకో ఎకరం చొప్పున రైతు బంధు ఇస్తామని చెప్పి నేటికీ 5 ఎకరాల వరకే రైతుబందు ఇచ్చారు .. ఇదేనా రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ది అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ ప్రకటనలో మాత్రమే ఉంది..కార్యరూపం దాల్చడం లేదనీ, ఉచిత విద్యుత్ పేరిట అవినీతికి పాల్పడుతు న్నారని మాత్రమే రేవంత్ రెడ్డి అన్నారనీ  గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఉద్యమ పార్టీ నుండి వచ్చిండు..స్వతంత్రంగా ఎమ్మెల్సీ గా గెలిచి వచ్చిన వ్యక్తి అన్నారు. జగిత్యాలలో రభీలో విద్యుత్ సరఫరా కోసం ధర్నా చేస్తే కనీసం 12 గంటలు కూడా విద్యుత్ ఇచ్చేందుకు ఎస్ ఈ హామీ ఇవ్వలేక పోయారు..24 గంటలు ఉచిత విద్యుత్ అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని చెప్పి రాత్రి పూట కూడా విద్యుత్ ఇస్తున్నారని, బీఆర్ఎస్ కు జ్ఞానోదయం అయి 24 విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

 మొన్నటి దాకా ఈ సోయి ఎందుకు లేదు అని ప్రశ్నించారు.చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇస్తామంటే ఉచిత విద్యుత్ ఇస్తారట.. తీగల మీదల బట్టలు అరేసుకోవాలి అని ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. ఈ మాటలు అన్నప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి చంద్ర బాబు వంచన లేరా...గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, తుమ్మల నాగేశ్వర రావు అందరూ టీడీపీ నుండి వచ్చిన వాళ్ళు కాదా.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో 90 శాతం చంద్రబాబు టీ డీ పీ లో నుండి వచ్చిన వారే..కెసిఆర్ ఎక్కడికెల్లి వచ్చిండు..టిడిపి నుండి రాలేదా అని నిలదీశారు. 16మంది కేబినెట్ లో మంత్రుల్లో ముగ్గురు మినహా అందరూ టీడీపీ నుండి వచ్చారు, ఇప్పుడు సాగుతున్న కేబినెట్ చంద్రబాబు మంత్రి వర్గమని, నేడు తెలంగాణ రాష్ట్రంలో చంద్ర బాబు వారసత్వ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. మంత్రి పదవి రాలేదని కెసిఆర్ తెలంగాణ ఉద్యమం ఎన్నుకున్నాడని..కెసిఆర్ కు మంత్రి పదవి ఇస్తే తెలంగాణ ఉద్యమం చేసేవాడా అని ప్రశ్నించారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వం అవకాశవాదానికి మారుపేరు అని, కాళేశ్వరం జాతీయ ప్రాజెక్ట్ కు జాతీయ హోదా సాధించకపోవడం.. తెలంగాణ రాష్ట్ర హక్కులు సాధించకపోవడం  మీ చేతకానితనం కాదా..రాష్ట్రంలో ఐటీఐఆర్ ను కొనసాగించలేకపోవడం మీ వైఫల్యం కాదా అని నిలదీశారు. కమిషన్ల బాగోతం కప్పిపుచ్చుకు నేందుకు...మోడీతో దోస్త్ చేశారని ఆరోపించారు. చంద్ర బాబు కాలం నుండి విద్యుత్ సరఫరాపై ఫైల్స్ బయట పెడుతామంటున్న  మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఫైల్స్ ఎందుకు బయటపెడుత లేరని  ప్రశ్నించారు. సీఎం డీ ప్రభాకర్ పట్ల తమకు విశ్వాసం ఉందని, ఈ ఆరు నెలలుగా వ్యవసాయానికి ఎన్ని గంటలు విద్యుత్ సరఫరా చేశారో  శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పాలన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు అడ్లురి లక్ష్మణ్ కుమార్, కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి, పిసిసి సభ్యులు గిరి నాగభూషణం, బండ శంకర్, మేడిపల్లి సత్యం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, నక్క జీవన్, జున్ను రాజేందర్, పుప్పాల అశోక్, మునేంధర్ రెడ్డి, చందా రాధా కిషన్, పిసిసి ఎన్ ఆర్ ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాష, నేహాల్, బొల్లి శేఖర్, హబీబ్, గుండా మధు, మహిపాల్, బీరం రాజేశం పాల్గొన్నారు.