డబుల్ బెడ్ రూం ఇళ్ళ కేటాయింపును పారదర్శకంగా జరపాలి

డబుల్ బెడ్ రూం ఇళ్ళ కేటాయింపును పారదర్శకంగా జరపాలి
  • అనర్హులకు ఇళ్లు కేటాయించిన ప్రజా ప్రతినిదులు పై చర్యలు తీసుకోవాలి

కోదాడ, ముద్ర: సూర్యాపేట జిల్లా మోతే మండలం అప్పన్న గూడెం లో డబుల్ బెడ్ రూం ఇళ్లను అర్హులకు పారదర్శకంగా కేటాయించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడ పట్టణంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆమె అప్పన్న గూడెం ప్రజలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అప్పన్న గూడెం లో 40 బెడ్ రూం ఇళ్లను నిర్మించిన ప్రభుత్వం ఇంకా లబ్దిదారులకు కేటాయించలేదని ఆమె తెలిపారు. అయితే ఈనెల 24వ తేదీ రాత్రి అధికార పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్, ఎం పీ టీ సీ లు 40 మంది  నుండి 10వేల రూపాయల చొప్పున వసూలు చేసి ఇళ్లను ఆక్రిమించుకోవాలని సూచించారని ఆమె తెలిపారు.

ఈ 40 మందిలో చాలా వరకు అనర్హులు వున్నారని, సర్పంచ్, ఎం పీ టీ సీ లు తమ బంధువులకు ఇచ్చారని ఆమె ఆరోపించారు. ఇదే విషయంపై గ్రామంలో ఇళ్లు రానివారు ఎం పీ టీ సీ ను ప్రశ్నంచగా అతడు మహిళలపై దాడి చేశారనీ తెలిపారు. దాడికి గురైన వారు ఈ విషయాలన్నీ ఎం ఎల్ ఏ దృష్టికి తీసుకురాగా ఆయన చర్యలు తీసుకోకుండా,కలెక్టర్ ను కలవాలని సూచించారనీ, ఈ విషయంలో బాధితుల పై దాడి జరిగిన ఎం ఎల్ ఏ స్పందించకపోవడం దారుణమన్నారు. బాధితుల పై దాడి చేసిన వారిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని, డబుల్ బెడ్ ఇళ్ళ కేటాయింపును పారదర్శకంగా జరపాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని ఆమె హెచ్చరించారు.