ప్రజావాణికి వినతుల వెల్లువ

ప్రజావాణికి వినతుల వెల్లువ

ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా వ్యాప్తంగా పలు మండలాలకు చెందిన బాధితులు తమ సమస్యలపై కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రపూల్ దేశాయ్ కి దరఖాస్తులు చేసుకున్నారు.

* పాలకుర్తి మండలం బొమ్మరకు చెందిన దండే బోయిన కుమార్ తన భూమిని కొందరు అక్రమంగా పట్టా చేసుకొని, తనను బెదిరిస్తున్నారని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని దరఖాస్తు చేసుకున్నాడు.

* లింగాలగణపురం మండలం పటేల్ గూడెంకు చెందిన కడుదూరి వెంకటయ్య 1995లో కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిలో నాటి నుంచి కబ్జాలో ఉన్నానని, ఆ భూమిని ధరణి పోర్టల్ లో ఎక్కించి పాసుబుక్ కు ఇచ్చి రైతు బంధు పథకం వర్తింపజేయాలని కోరారు.

* పట్టణంలోని జీఎంఆర్ కాలనీ వాసుల 50 ఫీట్ల రోడ్డును అక్రమంగా ఫినిషింగ్ చేసి గోడ నిర్మాణం చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు దరఖాస్తు చేసుకున్నారు.

* రఘునాథపల్లి మండలం కుర్పనపల్లి గ్రామానికి చెందిన పి.వెంకట్ రెడ్డి తన నాలుగు ఎకరాల భూమిని తన కొడుకు కోడలు పట్టా చేసుకొని తమను పట్టించుకోవడంలేదని వాపోయాడు. అనారోగ్య పాలైన తనకు, తన భార్య వైద్య ఖర్చుల నిమిత్తం కొడుకు కోడలుతో మాట్లాడి న్యాయం చేయవలసిందిగా దరఖాస్తు చేసుకున్నాడు.

* లింగాలఘణపురం మండలం నాగారం గ్రామానికి చెందిన పిట్టల వెంకట వీర మల్లయ్య తాను నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిని తనకు అంత్యోదయ కార్డు మంజూరు చేయాలని కోరారు. 

మొత్తంగా ప్రజావాణికి 62 దరఖాస్తులు రాగా అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 44 ఉన్నాయని అధికారులు తెలిపారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు సి.హెచ్ మధుమోహన్, కృష్ణవేణి, డీఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.