ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరు స్థానాల్లో సిపిఎం పోటీ

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరు స్థానాల్లో సిపిఎం పోటీ
  • కాంగ్రెస్ మాట మార్చింది 
  • ఇస్తామన్న సీట్లు ఇవ్వలేదు 
  • ఎన్నో మెట్లు దిగి చర్చలు చేశాం 
  • ఇంత అవమానకర రీతిలో పొత్తు అవసరం లేదు
  • ప్రకటించిన రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-కాంగ్రెస్ కమ్యూనిస్టుల పొత్తు విఫలమైంది. గత కొంతకాలంగా ఊరిస్తూ నాన్సుడు ధోరణితో సాగదీస్తూ వస్తున్న కాంగ్రెస్ సిపిఎం ఎన్నికల పొత్తు అంశం గురువారం కొండెక్కింది. సిపిఎం కాంగ్రెస్ ఎన్నికల పొత్తు అంశానికి ముగింపు పలుకుతున్నట్టు, సిపిఎం పార్టీ ఒంటరిగానే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించడంతో ఒక్కసారిగా తెలంగాణలో ఎన్నికల పొత్తు వాతావరణం మారిపోయింది. కేంద్రంలో బిజెపిని నిలువరించడానికి ఇండియా కూటమిలో ఉన్న సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉంటున్నట్టు ఇన్నాళ్లు భావించింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఏ ఏ సీట్లు సిపిఎంకు కేటాయించాలో పలు చర్చల ద్వారా ప్రతిపాదన చేశారు. సిపిఐ సిపిఎం లకు చెరి రెండు స్థానాలు ఇస్తున్నట్లు కాంగ్రెస్ మొదట అంగీకారం తెలిపినప్పటికీ చెరి ఒక స్థానంతో సరిపెట్టాలని సూచించడం, ఆస్థానాలు కూడా కమ్యూనిస్టులు అడిగినవి కాకుండా ఇతర ప్రాంతాల్లో ఇస్తామనడం, దీంతో కమ్యూనిస్టులు పలుమార్లు వేరువేరుగా వారి పార్టీ సమావేశాలు పెట్టుకొని చర్చలు చేయటం, ఆఖరికి గురువారం సాయంత్రం పొత్తు పొసగడం లేదని, తాము ఒంటరిగానే బరిలోనే ఉంటున్నామని సిపిఎం ప్రకటించడం చకా చకా జరిగిపోయాయి.

కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు చేసుకున్నట్లు సిపిఎం పార్టీ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలో మొత్తం 17 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం సాయంత్రం ప్రకటించగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరు స్థానాల్లో సిపిఎం పోటీ చేయనుంది. నల్గొండ జిల్లాలోని నల్లగొండ నకిరేకల్ మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కోదాడ అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం సిపిఎం పార్టీ ఎన్నికల  బరిలో ఉంటుందని అపార్టీ ప్రకటించింది. సిపిఐ పార్టీ కూడా శుక్రవారం హైదరాబాదులో జరిగే సమావేశంలో తమ నిర్ణయం ప్రకటిస్తామని తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ నేపద్యంలో కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ఖమ్మం జిల్లా లలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది.