అశాస్త్రీయ 111 జీఓ ను ఎత్తి వెయ్యడం హర్షణీయం...

అశాస్త్రీయ 111 జీఓ ను ఎత్తి వెయ్యడం హర్షణీయం...
  • ముప్పై ఏళ్ల కలను సాకారం చేసింది కేసిఆర్ సర్కార్...
  • నాడు జీఓ ఎత్తి వేయాలని ధర్నాలు చేసినవాళ్లే, నేడు విమర్శిస్తున్నారు...
  • హైదరాబాద్ నగరానికి 50 ఏళ్లకు సరిపడా నీళ్ళు ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే..
  • త్వరలో లేక్ సిటీ గా చేవెళ్ల
  • చేవెళ్ల ఎంపీ డాక్టర్. జి. రంజిత్ రెడ్డి
  • సెక్రటేరియట్ లో  సీఎం ను కలిసిన 111 జీఓ ప్రభావిత ప్రాంత ప్రజా ప్రతినిధులు.

ముద్ర ప్రతినిది: హైదరాబాద్ : చేవెళ్ల పార్లమెంట్ నియోజక వర్గ పరిధి లోని 84 గ్రామాల ప్రజల అభివృద్ది కి అడ్డుకట్టగా ఉన్న 111 జీఓ ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తి వెయ్యడం హర్షణియమని చేవెళ్ల ఎంపీ డాక్టర్. జి. రంజిత్ రెడ్డి అన్నారు. గత మూడు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం చెయ్యలేని పనిని కేసిఆర్ సుసాధ్యం చేశారని ప్రశంసించారు. మూడు దశాబ్దాల కలను సాకారం చేసిన ఘనత కెసిఆర్ దేనని, అయన కు చేవెళ్ల పార్లమెంట్ నియోజక వర్గ ప్రజలు ఎప్పుడు రుణ పడి ఉంటారన్నారు. జీఓ ప్రభావిత ప్రాంత ప్రజా ప్రతినిధులు ఖైరతాబాద్ లోని సెక్రటేరియట్ లో సీఎం కేసీఆర్ ను ఎంపీ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసి, కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సెక్రటేరియట్ మీడియా పాయింట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే లు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య లతో కలిసి ఆయన మాట్లాడుతూ 1996 లో అప్పటి ప్రభుత్వం అనాలోచితంగా, అశాస్త్రీయంగా తీసుకు వచ్చిన 111 జీఓ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధి లో 7 మండలాలు, 84 గ్రామాలలో 1.36 వేల ఎకరాలలో  అమలులో ఉందన్నారు. దాని వల్ల జీఓ ప్రభావిత గ్రామాల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడే నేపథ్యంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ జీఓ ఎత్తి వేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ మేరకు తాము అధికారంలోకి రాగానే జీఓ ఎత్తి వేస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్య మంత్రి కేసిఆర్ కు, రాష్ట్ర మంత్రి మండలి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

84 గ్రామాలలో 111 జీఓ ఎత్తి వేయాలని ఆ గ్రామాల సర్పంచులు, రాజకీయ నాయకులు తీర్మానాలు చేసి, గత పదేళ్లుగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు ఉద్యమాలు సైతం చేపట్టారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ సహా మంత్రులు ఎవరు రాజేంద్ర నగర్, చేవెళ్ల నియోజకవర్గాలకు వచ్చిన బిజెపి, కాంగ్రెస్ పార్టీ బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు  చెందిన నాయకులు ధర్నాలు చేసే వారని, కానీ నేడు వారే విచిత్రంగా ఎందుకు ఎత్తి వేశారని ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. ఇప్పుడు బిజెపి, కాంగ్రెస్ పార్టీ లు జీఓ ఎత్తి వేత పై ఎందుకు ఇంత యాగీ చేస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. దాని వెనుక ఉన్న మతలబు ను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. రాత్రికి రాత్రి అనాలోచితంగా తీసుకు వచ్చిన ఈ జీఓ ఎత్తి వేయాలని 1996 నుంచి చాలా ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయని, కానీ అది సాధ్య పడలేదన్నారు.  

తాగునీటి చెరువుకు అటు ఇటు 10 కిలో మీటర్ల మేర పరిధి ఉండగా, కొన్ని చోట్ల 25 మేర పరిధిని విస్తరించడం తో చాలా ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఈ విషయమై అప్పట్లోనే చాలా మంది కోర్టుకు వెళ్లారని, నేడు జంట నగరాలకు కృష్ణా, గోదావరి నదుల నుంచి తాగునీరు సరిపడా అందించడంతో జీఓ ఎత్తి వేసే పరిస్థితులు తలెత్తాయని వివరించారు. హైదరాబాద్ లో ఉండే  కోటి ఇరవై లక్షల జనాభాకు 35 టి ఎం సి నీరు అవసరముండగా, రాష్ట్ర ప్రభుత్వ చొరవో నాగార్జున సాగర్ నుంచి, కొండా పోచమ్మ సాగర్ నుంచి తాగు నీరు తీసుకు వస్తున్నామని  వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో  హైదరాబాద్ నగరానికి రాబోయే 50 ఏళ్లకు సరిపడా వచ్చే డిసెంబర్ కల్లా జంట నగరాలకు 105 టి ఎం సి ల తాగు నీరు తీసుకు వస్తుందన్నారు. జీఓ ఎత్తి వెయ్యడంతో చేవెళ్ల రూపు రేఖలు మారబోతున్నాయని, త్వరలో లేక్ సిటీ గా ఆవిర్భవించబోతుందని  పేర్కొన్నారు.