ప్రతిపక్షాలు గెలిస్తే దళిత బంధుకు జై భీమ్: రైతుబంధుకు రాంరాం

ప్రతిపక్షాలు గెలిస్తే దళిత బంధుకు జై భీమ్: రైతుబంధుకు రాంరాం
  • ధరణి రద్దుకు కాంగ్రెస్ కుట్ర
  • ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు
  • ప్రతి మండలానికి  రూ.20 లక్షలు
  • ఉమ్మడి అదిలాబాదులో 3 జిల్లాలు మావే
  • నిర్మల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి మాటల్లో చెప్పలేమని, ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు జిల్లాలు తమవేనని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఓటేస్తే "దళిత బందుకు జై భీమ్ రైతుబంధుకు రామ్ రామ్" చెబుతారని ఆయన ఎద్దేవా చేశారు. అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో దోపిడీ లక్ష్యంగా పరిపాలన కొనసాగిందన్నారు. ఈ దోపిడీని నివారించి, రైతులకు ఉపయోగకరంగా రూపొందించిన ధరణి విధానాన్ని కాంగ్రెస్ నేతలు తొలగిస్తామంటున్నారని పేర్కొన్నారు.ఇదే గనక జరిగితే అవినీతి రాజ్యమేలుతుందని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో విఆర్వోలు చేస్తున్న అవినీతికి చెక్ పెట్టేందుకే ధరణి కార్యక్రమం రూపొందించామన్నారు.

నిర్మల్ జిల్లాలో ఉన్న 396 గ్రామపంచాయతీలకు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయించినట్లు కేసీఆర్ ప్రకటించారు. అలాగే నిర్మల్, ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాలకు ఒక్కోదానికి రూ.25 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. గత 50 సంవత్సరాల పాలనలో పాలించిన దుర్మార్గులు అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయారన్నారు. అన్ని గ్రామాల్లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం చూసి మహారాష్ట్ర రైతులు ఆశ్చర్యపోతున్నారన్నారు. మిషన్ కాకతీయ తో ఎండిన చెరువు నిండాయని, వ్యవసాయం పండగలా మారిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని గిరిజన తండాలను జీపీలుగా మార్చనున్నట్లు పేర్కొన్నారు. రైతులకు రైతుబంధు తో పాటు మరణిస్తే రూ.5 లక్షల  బీమా సౌకర్యం కూడా తమ ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. జిల్లాలో వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు వైద్య కళాశాల కూడా మంజూరైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జి విఠల్ రెడ్డి, రేఖ నాయక్ జోగు రామన్న ఎమ్మెల్సీ దండే విటల్ జెడ్పి చైర్ పర్సన్ విజయలక్ష్మి ఐడిసి చైర్మన్ వేణుగోపాల చారి వివిధ ప్రాంతాల ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.