విద్య ద్వారానే వికాసం సమగ్ర అభివృద్ధి సాధ్యం

విద్య ద్వారానే వికాసం సమగ్ర అభివృద్ధి సాధ్యం
  • మహేంద్ర ప్రతిభా పురస్కారాల లో ఎమ్మెల్యే సంజయ్..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: నేటి పోటీ ప్రపంచంలో విద్య ద్వారానే వికాసం సమగ్ర అభివృద్ధి సాధ్యమని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్  అన్నారు. పట్టణంలోని ఎస్ వి ఎల్ ఆర్ గార్డెన్ లో జగిత్యాల జిల్లా మహేంద్ర (మేదర) సంఘం ప్రతిభ పురస్కారాలు 2022-23 కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ప్రభుత్వం నాణ్యమైన విద్య పై ప్రత్యేక దృష్టి సారించిందని, బడుగు బలహీన, మైనారిటీ వర్గాల పిల్లల్లో దాగున్న శక్తి సామర్థ్యాలు బయటికి రావడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ వ్యవసాయ చేతివృత్తులు కనుమరుగవుతున్న తరుణంలో వ్యవసాయం కూడా యాంత్రికమై పోయిందని వ్యవసాయ అనుసంధానమైన వృత్తి వెదురు వృత్తి అని గుర్తు చేశారు. 

వివిధ పథకాలతో సబ్బండ వర్గాల అభ్యున్నతికి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ హరితహారంలో ప్రభుత్వం అనవసరమైన మొక్కలు నాటేకన్నా వెదురు మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణం పరిరక్షించేందుకు దోహదం చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం బడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామని చెప్పుకుంటూ పోతుందే తప్పా చేసిందేమీ లేదన్నారు. మేదరులకు చేసిందేమీ లేదని వెదురు వృత్తిదారుల సమస్యలను కాంగ్రెస్ మేనిఫెస్టో లో చేర్చుతామని హామీ ఇచ్చారు. జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ విద్య వల్లనే సర్వం సాధ్యమని అన్నారు.

పిల్లలు విద్యపై దృష్టి కేంద్రీకరించి చదువుకోవడం వల్ల ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చని, తల్లిదండ్రులు కూడా పిల్లల విద్యని తరచుగా పరీక్షిస్తుండాలని బాగా చదవాలి. బాగా ఎదగాలి. మన చుట్టూ సమాజం ఎదగడానికి మనం ఉపయోగపడాలని పిలుపునిచ్చారు. గ్రంధాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ బీసీ కులాల్లో విద్య పై చైతన్యం రావాలని మారుమూల గ్రామాల్లో సైతం చిన్న చిన్న కులాల్లో పిల్లల్ని బాగా చదివించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు పట్టణ మేదర సంఘం అధ్యక్షులు చింత గంగారాం, డాక్టర్ చింత రమేష్, చింతల గంగాధర్, చింత రమేష్, వేముల శ్రావణ్, బొమ్మిడి నరేష్, గైని లచ్చన్న, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.