గల్లీలో అయ్య లిక్కర్ దందా చేస్తే.. ఢీల్లీలో బిడ్డ లిక్కర్ స్కాం చేసింది

గల్లీలో అయ్య లిక్కర్ దందా చేస్తే.. ఢీల్లీలో బిడ్డ లిక్కర్ స్కాం చేసింది

బీఆరెస్, బీజేపీ అవిభక్త కవలలు.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : గల్లీలో అయ్య లిక్కర్ దందా చేస్తే.. ఢీల్లీలో బిడ్డ లిక్కర్ స్కాం చేసింది. మీ నలుగురు కుటుంబ సభ్యుల దోపీడీ చేసి దొరికితే .. మా తెలంగాణ ప్రజలకు ఏం సంబంధమని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు . హాత్ సే హాథ్ జో డో యాత్ర లో భాగంగా  ఎమ్మెల్సి జీవన్ రెడ్డితో కలిసి చల్ గల్ నుండి పాదయాత్ర చేపట్టి కొత్త బస్టాండ్ వరకునిర్వహించి అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ  జీవన్ అన్న జీవితం తెరిచిన పుస్తకం. రాజకీయాల్లోకి రావాలనుకునేవారు జీవన్ అన్న ను ఆదర్శంగా తీసుకోవాలి. 42ఏళ్లుగా ప్రజల కోసం జీవితం అంకితం చేస్తున్న ఏకైక నాయకుడు జీవన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడిని జగిత్యాల గడ్డపై 50వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించాలి. జీవన్ అన్నకు ఢిల్లీ అయినా.. గల్లీ అయినా జగిత్యాలనే అని అన్నారు. బీఆరెస్ నేతలు గ్రామాల్లో రైతుల భూములను గుంజుకుని వారి జీవితాలతో చెలగాటం ఆడుతారా? ఇక్కడి ఎమ్మెల్యేకు బుద్ది ఉందా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇక్కడి రిక్రియేషన్ జోన్ లను రద్దు చేస్తాం. తొమ్మిదేళ్లలో కేసీఆర్ కు 23లక్షల కోట్లు వస్తే... నియోజకవర్గానికి 23 వేల కోట్లు రావాల్సి ఉంది. 23లక్షల కోట్లు బొక్కింది కేసీఆర్ కుటుంబమేనని అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ లో మధుయాష్కీ ని గెలిపిస్తే తెలంగాణ తీసుకొచ్చారు. కవితను గెలిపిస్తే 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెస్తా అని హామీ ఇచ్చి గాలికొదిలేశారు. అందుకే ఆమెకు ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పారు.

పసుపు బోర్డు తెస్తా అని చెప్పిన అరవింద్... ఐదేళ్లయినా పసుపు బోర్డు తేలేదన్నారు. మీ కుటుంబం అక్రమాలకు పాల్పడ్డారని కేంద్ర ప్రభుత్వ సంస్థ చెబుతోంది. తెలంగాణ సమాజం కేసీఆర్ ను నమ్మి  ఓటేస్తే.... గంపగుత్తగా వెళ్లి మోదీకి మద్దతు తెలిపారు. మోదీ సీబీఐ, ఈడీ తో ప్రభుత్వాలను పడగొడుతుండని గొంతు చించుకొని చెప్పినా వినలేదు. సోనియాను అవమానించడానికి ఈడీ ఆఫీసుకు పిలిచినపుడు కేసీఆర్ మాట్లాడలేదు. ఆనాడు మోదీతో జోడీ కట్టిన మీకు ఇవాళ మేము ఎందుకు మద్దతు ఇస్తాంమని ప్రశ్నించారు. అధికారం ఉందని ఆనాడు విమలక్క, మందకృష్ణ మాదిగ, తీన్మార్ మల్లన్న, రవి ప్రకాష్ లను అరెస్టులు చేశావు కదా..2018 లో నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి నన్ను జైల్లో పెట్టి ఎన్నికల్లో నన్ను ఓడించావు కదా..కోదండరాం ను ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఈడ్చుకెళ్లారు కదా..కేసీఆర్.. నువు ఏది ఇస్తే అదే నీకు తిరిగి వస్తుందని అన్నారు. కేసీఆర్, బీజేపీ వేరు వేరు కాదు..బీఆరెస్, బీజేపీ అవిభక్త కవలలని అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ. 5లక్షలు సాయం అందిస్తుంది. రైతులు బ్యాంకు లకు రుణాలు చెల్లించకండి.. కాంగ్రెస్ వస్తుంది.. రూ. 2లక్షల రుణమాఫీ చేస్తుంది.2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. పేదవారికి రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుంటాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ప్రాంతంలో చెరుకు రైతులను ఆదుకుంటాం. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో చెరుకు ఫ్యాక్టరీని తెరిపిస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, జిల్లా అధ్యక్షుడు , లక్ష్మణ్ కుమార్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.