విభజన హామీలను అమలు చేయకుండా పర్యటించటం

విభజన హామీలను అమలు చేయకుండా పర్యటించటం

 సిగ్గుచేటు:సిపిఎం కేంద్ర కమిటి సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు 

ముద్ర ప్రతినిధి భువనగిరి :తెలంగాణ రాష్ట్ర విభజన చట్టం హమీలను అమలుచేయకుండా కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని‌, విభజన హామీలు అమలు చేయకుండా ఎం మొఖం పెట్టుకొని తెలంగాణకు వచ్చారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు,మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను నిరసిస్తూ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటి సమావేశంలో  ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణకు బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, మెడికల్‌ కాలేజీలు, ఐఐటీ, ఐఐఎం, త్రిపుల్‌ ఐటీ, గిరిజన, మైనింగ్‌ యూనివర్సిటీలనూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిది ఏండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఇవ్వకుండా మోసం చేస్తుందని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం రాష్ట్రాల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా యువతను మోసం చేసిందన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయని ఇప్పటికైనా విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు భర్తీ చేయకుండా, ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా ఓట్ల కొరకు ఆయా రాష్ట్రాలు తిరుగుతూ మోడీ ప్రజలను మోసం చేస్తున్నారని వారు అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయకుండా కార్పొరేట్ యాజమాన్యాలతో కొమ్ముకాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగోడుతు ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు పరం చేయాలని చూస్తుంది అని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహకరించడంలో పూర్తిగా విఫలమైందని వారు అన్నారు. మత రాజకీయాలు రెచ్చగొట్టే ప్రయత్నం బిజెపి చేస్తుంది అని వారు అన్నారు. అదేవిధంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఎమ్స్ లో అన్ని రకాల వైద్యం అందించాలని, ఎమ్స్ జిల్లాలో ఉండటం వల్ల మూడు జిల్లాలకు ఉపయోగం జరుగుతుంది అని, అక్కడ మాత్రం సరైన వైద్యం అందటం లేదు అని ఎమ్స్ కు అధిక నిధులు కేటాయించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, జిల్లాలో రైల్వే స్టేషన్ ను ఆధునీకరణ చేసి అన్ని రకాల రైళ్లు నిలపాలని వారు డిమాండ్ చేశారు.

వీరితోపాటు రాష్ట్ర కమిటి సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగ నర్సింహులు, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు,జిల్లా కమిటి సభ్యులు,మండల కార్యదర్శులు సిర్పంగి స్వామి, దయ్యాల నర్సింహ, బొల్లు యాదగిరి, మద్దెల రాజయ్య, మాయ కృష్ణ, జెల్లల పెంటయ్య, బబ్బూరి పోశెట్టి, గంగాదేవి సైదులు, ఎండి పాషా బొడ్డుపల్లి వెంకటేష్, గడ్డం వెంకటేష్, ఎంఎ ఇక్బాల్, బోలగాని జయరాములు, మద్దెపురం రాజు పాల్గొన్నారు.