అసంతృప్తితో రగులుతున్న హుజూర్నగర్ టిఆర్ఎస్ క్యాడర్

అసంతృప్తితో రగులుతున్న హుజూర్నగర్ టిఆర్ఎస్ క్యాడర్
  • ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలపై వెల్లువెత్తుతున్న నిరసనలు
  • కొందరికి ప్రోత్సాహం మరికొందరికి నిరుత్సాహం
  • ఎమ్మెల్యే  పక్షపాతం
  • పార్టీ అభివృద్ధికి అశనిపాతం
  • ఎమ్మెల్యే వైఖరి పై నానాటికి
  • గళ మెత్తుతున్న ధిక్కారస్వరాలు
  • జోరు అందుకున్న వర్గ పోరు 
  • పార్టీ పరిస్థితి నానాటికి దిగజారు
  • ఇలా ఉంటే ఎన్నికల నాటికి బేజారు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో అధికార పార్టీ వర్గ విభేదాలతో కూనారిల్లుతున్నదని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల మధ్య నానాటికి వర్గ పోరు ఎక్కువైతూ విభేదాలు బగ్గుమంటున్నాయి. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధిష్టానానికి వ్యతిరేకంగా హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఒంటెద్దు పోకడలు నిరసిస్తూ గత కొద్ది కాలంగా ఎంపీపీలు జడ్పీటీసీలు ఇతర రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించారు. తాజాగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా పార్టీ ఎమ్మెల్యే అనుకూల ప్రతికూల వర్గాలుగా విడిపోయింది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ పరిస్థితి ఇలాగే చక్కదిద్దకుండా ఉంటే ఎన్నికల నాటికి మరింతగా దిగజారి ఎన్నికల్లో అభాసుపాలుగాక తప్పదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

గ్రామాల్లో ఆత్మీయ సమ్మేళనాలు

హుజూర్నగర్ మండలంలో పార్టీ అధ్యక్షుడు ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ ఎమ్మెల్యే కూడా పట్టించుకో పోగా సదరు అధ్యక్షుడికి మద్దతుగా నిలవడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల వ్యతిరేక వర్గం అంతా కూడా ఆత్మీయ సమ్మేళనం మామిడి తోటలో నిర్వహించారు హుజూర్నగర్ మండలంలోని వేపల సింగారం అమరవరం లింగగిరి లక్కవరం బూరుగడ్డ కరక్కాయల గూడెం గోపాలపురం గ్రామాల చెందిన బీ ఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖలు, ఇతర ముఖ్య నాయకులు ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్నారు. హుజూర్నగర్ మండల పార్టీ అధ్యక్షుడు ముడెం గోపిరెడ్డికి వ్యతిరేకంగా సారెడ్డి భాస్కర్ రెడ్డి రెక్కల శంబిరెడ్డి, నంది రెడ్డి సైదిరెడ్డిల ఆధ్వర్యంలో వ్యతిరేకవర్గమంతా ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్నారు.

సమన్వయం ఎండమావి కానుందా

బీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తి కేడర్ అంతా ఏకమై ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ప్రజలకు పార్టీ పరిస్థితిని వివరిస్తున్నారు నాయకుల మధ్య సమన్వయం లేదని నాయకులను ప్రజలను కలుపుకొని పోవాల్సిన నాయకులు పక్షపాతంతో వ్యవహరిస్తూ పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినవస్తున్నాయి నాయకులు ప్రజల మధ్య సమన్వయం కొరవడి సఖ్యత లేదని ఎమ్మెల్యే సైదిరెడ్డి ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ మిగతా వారిని విస్మరిస్తున్నారని ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనంలో పలువురు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతుందని పట్టించుకోవాల్సిన ఎమ్మెల్యే చక్కదిద్దకుండా తన ఆస్మదీయులకే పెద్ద పీట వేస్తున్నారని ఆయా గ్రామాల్లోని మెజార్టీ బీ ఆర్ఎస్ నాయకులు వాపోతున్నారు. 2004 నుంచి పార్టీలో ఉన్నప్పటికీ సీనియార్టీని లెక్కచేయకుండా అనుభవాన్ని పరిగణలోనికి తీసుకోకుండా నిన్న మొన్న వచ్చి మాయ మాటలు చెబుతున్న వారికే పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని వాస్తవాలు మాట్లాడితే విసుక్కుని మాట్లాడటానికి కూడా ముఖం చాటేస్తున్నారని ఇలా అయితే పార్టీ అభివృద్ధి కోసం తాము ఎందుకు పనిచేయాలని పలువురు ప్రశ్నిస్తున్నారు.

నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి

కేవలం హుజూర్నగర్ మండలమే కాకుండా నియోజకవర్గంలోని నేరేడుచర్ల పాలక వీడు గరిడేపల్లి మఠంపల్లి తదితర మండలాల్లో కూడా పార్టీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే సైదిరెడ్డికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి సమావేశం నిర్వహించారు అక్కడ సమావేశంలో పాల్గొన్న వారిపై ఎమ్మెల్యే కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతున్నాడని సమావేశంలో పాల్గొన్న ఎంపీపీలు జడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని కనీసం కలవడానికి కూడా ఎమ్మెల్యే సమయం ఇవ్వడం లేదని నియంతృత్వంతో వ్యవహరిస్తూ ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన వారిని పక్కన పెడుతూ తనను పొగిడే వారిని మాత్రమే కలుస్తున్నాడని వారికే సమయం కేటాయిస్తున్నాడని ఇటీవల పార్టీ అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు కూడా లేవని ఈ నేపథ్యంలో పట్టణంలోని కౌన్సిలర్లు కూడా వైస్ చైర్మన్ అవినీతిపై ప్రశ్నిస్తూ అవిశ్వాసానికి నోటీసులు ఇవ్వడం జరిగిందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారిని విస్మరించడమే కాకుండా విమర్శిస్తూ కనీసం సంక్షేమ పథకాలు కూడా అందకుండా చేస్తున్నారని పార్టీలోని మెజార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ ఎమ్మెల్యే అనుకూల వ్యతిరేకవర్గాలుగా చీలిపోయే పరిస్థితులు దాపురించడంతో శాసనసభ ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి మరింత దిగజారి ఎన్నికల్లో అభాసుపాలు గాక తప్పదని రాజకీయ విజ్ఞులు పార్టీలో అనుభవం గల మేధావులు వ్యాఖ్యానించడం  గమనార్హం. ఈ నేపథ్యంలో హుజూర్నగర్ నియోజకవర్గంలో బీ ఆర్ఎస్ పార్టీ పరిస్థితి వర్గపోరుతో విభేదాలతో  కూనరీల్లుతుందా, కుంటుపడుతుందా, అసెంబ్లీ ఎన్నికల్లో అడుగంటుతుందా లేదంటే పార్టీ అధిష్టానం జోక్యం చేసుకొని పరిస్థితులు చక్కదిద్దుకొని నాయకుల మధ్య సమయం చేసి పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం  దిశగా దూసుకుపోతుందా అన్న విషయాలు స్పష్టం కావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.