తలనీలాల టెండర్ పై ఆసక్తి చూపని వ్యాపారులు - జీఎస్టీ తొ ఆందోళన

తలనీలాల టెండర్ పై ఆసక్తి చూపని వ్యాపారులు -  జీఎస్టీ తొ ఆందోళన

ముద్ర, మల్యాల:ప్రసిద్ధి కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో భక్తులు సమర్పించే తలనీలాలను ప్రొగు చేసుకునే హక్కు (ఏడాది కాల పరిమితి) కి ఆలయ అధికారులు ఈ నెల 14 న టెండర్ నిర్వహించడానికి ప్రకటన జారీ చేశారు. దానికి ఈ నెల 12 సాయంత్రం 5 గంటల వరకు చివరి తేది పేర్కొన్నప్పటికి, వ్యాపారులు డీడీ లు సమర్పించడానికి ముందుకు రాలేదు. దాంతో ఆలయ అధికారులు మరోసారి టెండర్ ప్రకటన జారీ చేయనున్నట్లు ప్రకటించారు. 

జీఎస్టీతోనే సమస్య

టెండర్ దక్కించుకున్న వారు జీఎస్టీతొ కలిపి డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ఆలయ అధికారులు పేర్కొనడం వల్లనే వ్యాపారులు ముందుకు రావడం లేదని తెలిసింది. అయితే ఒకరిద్దరు ఇంట్రెస్ట్ గా ఉన్నప్పటికీ, ప్రధానoగా పాట పాడే గుత్తేదారులు ఆసక్తి చూపకపోవడంతోని, వారు కూడా ముందుకు రాలేదని సమాచారం. అయితే ఎక్కడా లేని విధంగా కొండగట్టులోనే జీఎస్టీ వసూల్ చేస్తున్నారని, దాని వల్ల టెంపుల్ కి ఉపయోగం ఏమి లేదని పలువురు అన్నారు. ఆలయాల్లో వ్యాపారాలు చేసుకునేవారికి జీఎస్టీ మినహాయింపు ఉందని వారు పేర్కొన్నారు.

కోటి 60 లక్షల జీఎస్టీ బకాయి

కాగా, జీఎస్టీ చెల్లించకపోవడం వల్ల ప్రస్తుత, గత ఏడాదికి సంబందించి గుత్తేదారులు ప్రొగు చేసుకున్న తలనీలాలను తమ అధీనంలోనే ఉంచినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అయినా గుత్తేదారులు జీఎస్టీ బకాయి చెల్లించడం లేదని,  దాదాపు కోటి 60 లక్షల జీఎస్టీ అమౌంట్ చెల్లించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.