డాక్టర్ సుగుణాకర్‌‌ రాజు పై వేటు

డాక్టర్ సుగుణాకర్‌‌ రాజు పై వేటు

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్‌‌ నుంచి పేరు తొలగింపు

ఆర్డర్‌‌ విడుదల చేసిన నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌

 పోలీసు కేసులో తప్పడు నివేదిక ఇచ్చినట్టు గుర్తింపు

బాధితుడి 12 ఏళ్ల పోరాట ఫలితం

ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్‌‌ సుగుణాకర్‌‌రాజుపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిషేధం విధించినట్టు తెలుస్తోంది. ఓ పోలీసు కేసు కోసం ఒక మహిళకు తప్పడు ధ్రువీకరణ పత్రం ఇచ్చిన క్రమంలో సరదు బాధితుడి ఫిర్యాదు మేరకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎతిక్స్, మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు ఆయనపై చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. 

అసలు కథ ఇదీ...

2011లో జనగామ డీఎస్పీగా పనిచేసిన నాగరాజు కుమార్తెను వివాహం చేసుకున్న పాండుగుల దామోదర్ చెన్నై ఓఎన్‌జీసీ సైంటిస్ట్‌ గా పనిచేసే వారు. అయితే భార్యభర్త మధ్య వచ్చిన గొడవలతో తన భర్త కడుపులో తన్నడంతో గర్భశ్రావం అయినట్టు ఆమె వరంగల్ మహిళా పీఎస్‌లో కేసు పెట్టింది. అయితే దీనిని నిర్దారిస్తూ జనగామకు చెందిన డాక్టర్‌‌ సుగుణాకర్ మెడికల్ రిపోర్ట్ ఇవ్వడంతో దామోదర్‌‌ ఉద్యోగం పోవడంతో పాటు జైలుపాలయ్యడు. ఆ మానసిక క్షోభతో అతడి తండ్రి చనిపోయారు. అయితే సుగుణాకర్‌‌రాజు తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం వల్లే తమ కుటుంబం ఆగం అయ్యిందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వైద్య విధాన పరిషత్ అధికారులు, ఆంధ్ర, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులకు దామోదర్‌‌ ఫిర్యాదు చేశారు. దాదాపు 12 ఏళ్లుగా ఇందుకోసం పోరాటం చేస్తూనే ఉన్నారు.

డాక్టర్‌‌ సుగుణాకర్‌‌రాజు డబ్బు, రాజకీయ పలుకుబడితో ఆరోగ్య శాఖను, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులను ప్రలోభ పెట్టినట్టు తెలుస్తోంది. దాని ఫలితంగానే వారు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో విసిగిపోయిన దామోదర్‌‌ ఢిల్లీలోని నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ను ఆశ్రయించారు. ఈ క్రమంలో వారు డాక్టర్‌‌ సుగుణాకర్‌‌రాజును సంజాయిషీ కోరింది. వివరణ అందిన తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎత్తిక్స్ కమిటీ సభ్యులు అన్ని ఆధారాలు పరిశీలించి డాక్టర్‌‌ సుగుణకర్‌‌రాజు వైద్య వృత్తిలో అనైతికంగా వ్యవహరించాడని గుర్తించారు. ఈ క్రమంలోనే అతని పేరును తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ నుంచి 6 నెలల పాటు తొలగించాలని ఆర్డర్ ఇచ్చారు. దీంతో సుగుణకర్ రాజు ఇక 6 నెలల వరకు ఎలాంటి మెడికల్ ప్రాక్టీస్ చేయకూడదు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నేను ఎలాంటి సంజాయిషీ ఇవ్వలేదు: డాక్టర్ సుగుణాకర్ రాజు

వచ్చిన నోటీసులకు నేను ఎలాంటి సంజాయిషీ ఇవ్వలేదు. ఈ కేసు గురించి నేను మర్చిపోయాను. దీనిపై తప్పకుండా అప్పీల్ కు వెళ్తాను. దిగులు పడాల్సిన అవసరం లేదు. నా తప్పు లేకున్నా కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.