విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

 రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఏబీవీపీ

ముద్ర ప్రతినిధి, మెదక్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ మెదక్ రాందాస్ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. పెండింగ్లో ఉన్నటువంటి 5300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎబివిపి స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మల్యాల రాకేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసి తమ రాజకీయ పబ్బం గడుపుతుందని విమర్శించారు.

పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా కనీసం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేవన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు పాకెజీల పేరుతో, ఫీజుల పేరుతో వేలాది రూపాయిలు దండుకున్న చూసి చూడనట్టు విద్యాధికారులు వ్యవహంచే తీరును తీవ్రంగా ఖండించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పట్ల స్పందించి వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శశికాంత్, నగర కార్యదర్శి ఉదయ్, అనిల్, నితిన్, రాజేష్, అరవింద్, మీరజ్ తదితరులు పాల్గొన్నారు.