మణిపూర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి

మణిపూర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : గత కొన్ని నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో ప్రజలపై,కొన్ని తెగలపై,మహిళల పై జరుగుతున్న దాడులు, అత్యాచారాల పై కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని, మహిళలను వివస్త్రలను చేసి కాల్చి చంపుతున్నా చూస్తూ ఊరుకుంటున్న మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ్ రెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల కు మతపరమైన రంగు అంటిస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఆ ప్రజలకు సంఘీభావంగా సోమవారం కరీంనగర్ లోని తెలంగాణ చౌక్,గీతాభవన్ సర్కిల్ వద్ద సీపీఐ, సీపీఐ(ఎం),విద్యార్థి,యువజన,మహిళా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మానవ హారం,కళ్ళకు నల్ల గుడ్డ కట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవ్ రెడ్డి, సురేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ  నేతలు ఒకవైపు భారత్ మతాకి జై అంటూ మరోవైపు  దేశంలో మహిళల పై అత్యాచారాలు,హత్యలు జరుగుతున్నా పట్టించుకోక పోవడం సిగ్గుచేటన్నారు. మణిపూర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపి ప్రభుత్వం తెగల మధ్య, మతాల మధ్య  చిచ్చుపెట్టి మారణ హోమం సృష్టిస్తూ ప్రజలను, మహిళలను హింసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఏకంగా మహిళలను వివస్త్రలను చేసి నడిరోడ్డు పై ఊరేగిస్తూ అత్యాచారం చేసి,హత్యలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలకులు పట్టించుకోకవడం దుర్మార్గం అని మండిపడ్డారు. స్వయంగా ఆ రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి ఇక్కడ ఇలాంటి సంఘటనలు సర్వసాధారణమే అని తేలికగా కొట్టిపారేయడాన్ని సీపీఐ, సీపీఐ (ఎం) తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ఇంత జరుగుతున్నా మణిపూర్ రాష్ట్రానికి ఇంచార్జీ గా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించక పోవడం సిగ్గుచేటని,ముఖ్యమంత్రిని తక్షణమే తొలగించి ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మానవహారం అనంతరం  మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని,మహిళలను  హింసించి చంపిన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ చౌక్ నుండి మల్టీప్లెక్స్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు,మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకులు గూడెం లక్ష్మీ,సీపీఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం,సీపీఐ, సీపీఎం జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్,పైడిపెల్లి రాజు,డి.నరేష్ , కసిబోజుల సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.