ఘనంగా రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు

ఘనంగా రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు

ముద్ర న్యూస్ బ్యూరో,హైదరాబాద్: మౌలాలిలోని శ్రీరంగగిరిపై రంగనాథస్వామి నవమ వార్షిక బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు శుక్రవారం ఉదయం సుప్రభాత సేవతో ఉత్సవ కార్యక్రమం మొదలైంది.


ఉదయం ప్రభాత ఆరాధన అనంతరం తిరుప్పావై, ప్రాబోదకి ఆరగింపు జరిగాయి. అనంతరం జరిగిన ధ్వజారోహణం కార్యక్రమానికి ఉప్పల్ శాసన సభ్యులు  బండారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర బి.జె.పి అధికార ప్రతినిధి  ఎన్.వి.ఎస్.ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్లు జె.ప్రభుదాస్, పి.దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్  జి.శ్రీనివాసరెడ్డి, ఇతర స్థానిక నాయకుల స్వామివారి సేవా కైంకర్యంలో పాల్గొన్నారు.ప్రాబోదకి అనంతరం ద్వార తోరణ ధ్వజకుంభారాధన, చతుస్థ్సానార్చన అనంతరం అగ్ని ప్రతిష్ఠ, మూలమంత్రహవనం జరిగాయి. 


10-30కు వైనతేయ ప్రతిష్ఠ, ధ్వజపట ఆరాధన, ధ్వజారోహణం,  గరుడబలి, ప్రసాద నివేదన అనంతరం ఆ ప్రసాదాన్ని సంతానార్థులైన జంటలకు వితరణ చేశారు. జరిగింది. కన్నులపండువగా జరిగిన ధ్వజారోహణం అనంతరం నిత్యపూర్ణాహుతి, తీర్థప్రసాద వితరణ జరిగాయి.
శ్రీరంగగిరి వైభవం భాగ్యనగరమంతా వ్యాపించి, నగరానికే ఈ కొండ గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కొనియాడారు. దేవాలయ అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు.