హిస్టరీ అఫ్ ఇండియన్ జర్నలిజం  పుస్తకావిష్కరణ

హిస్టరీ అఫ్ ఇండియన్ జర్నలిజం  పుస్తకావిష్కరణ

పాట్నా , ఆగస్ట్ 26: విశ్రాంత ఉపాధ్యాయుడు మాడభూషి కృష్ణ ప్రసాద్ రచన "హిస్టరీ ఆఫ్ ఇండియన్ జర్నలిజం" పుస్తకాన్ని బీహార్ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సురేంద్ర రామ్ ఆవిష్కరించారు. బీహార్ విధానమండలి ఉపభవనం సమావేశమందిరంలో శనివారం మొదలయిన  ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభ సభలో  పుస్తకావిష్కరణ జరిగింది. కార్యక్రమంలో బీహార్ కార్మిక శాఖా మంత్రితో పాటు, బీహార్ శాసనసభ లో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత  షకీల్ అహ్మద్ ఖాన్, సీపీఐ శాసనసభా పక్ష నాయకుడు సూర్య కాంత్ పాశ్వాన్ , సీపీఐ ఎం.ఎల్. శాసన సభ్యులు సందీప్  సౌరభ్ , ఐ.జే.యు. జాతీయ అధ్యక్షుడు కే.శ్రీనివాసరెడ్డి , సెక్రెటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ , పూర్వాధ్యక్షుడు ఎస్.ఎన్. సిన్హా , జాతీయకార్యదర్శి డి.సోమసుందర్ , బీహార్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నివేదితా ఝా , ప్రధాన కార్యదర్శి కమల్ కాంత్ సహాయ్ , రచయిత మాడభూషి కృష్ణ ప్రసాద్ , వంగపండు నరసింహమూర్తి , తదితరులు  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఐజేయు అధ్యక్షుడు కే .శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విశ్రాంత ఉపాధ్యాయుడు మాడభూషి కృష్ణ ప్రసాద్ ఎంతో పరిశోధన చేసి ఒక మంచి ప్రమాణాలు కలిగిన భారతీయ పత్రికారంగ చరిత్ర పుస్తకాన్ని తెలుగులో రాశారని , ఆయనే దాన్ని ఇంగ్లీష్ అనువాదం చేశారని , తాజాగా ప్రచురితమైన ఇంగ్లీషు పుస్తకాన్ని ఐజేయు కార్యవర్గ సమావేశాల వేదికపై ఆవిష్కరించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రచయిత మాడభూషి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జర్నలిస్ట్ కావాలన్న తన చిన్నప్పటి  కల నెరవేరలేదనీ , 40 ఏళ్ళపాటు బడిపిల్లలకు  ఇంగ్లీషు గ్రామర్ బోధించి పదవీ విరమణ చేసిన తర్వాత పరిశోధన చేయడానికి తనకు సమయం చిక్కిందని  అన్నారు. తనకు జర్నలిజం పై ఉన్న ప్రేమతోనే హిస్టరీ అఫ్ ఇండియన్ జర్నలిజం పుస్తకాన్ని రచించానని తెలిపారు. కార్టూనిస్ట్ శంకర్ పై రాసిన పుస్తకం ఇటీవలే ప్రచురితం అయిందన్నారు.

త్వరలో జర్నలిజంపై మరికొన్ని పుస్తకాలు రాస్తానని తెలిపారు. తన పుస్తకాన్ని ఆవిష్కరణ చేసిన ఐజేయూ జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రచయితను బీహార్ కార్మిక మంత్రి సురేంద్ర రామ్ శాలువాతో సత్కరించారు. రచయిత మాడభూషి కృష్ణ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లాలోని, పాలకొల్లు పట్టణానికి చెందినవారు. పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని పాట్నా జాతీయకార్యవర్గ సమావేశంలో నిర్వహించడంపై ఏ.పి.యు.డబ్ల్యు.జే. అధ్యక్షుడు ఐవి.సుబ్బారావు హర్షం వ్యక్తం చేశారు.