విద్యార్థుల ఆత్మహత్యలను నివారించే బాధ్యత ప్రభుత్వానిదే 

విద్యార్థుల ఆత్మహత్యలను నివారించే బాధ్యత ప్రభుత్వానిదే 
  • ఈ నెల 28 న అప్ చలో బాసర ట్రిపుల్ ఐటీ
  • ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ 

ముద్ర, ముషీరాబాద్: బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఐఐఐటీలో విద్యార్థుల, కార్పొరేట్ కాలేజీల విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే నివారించే బాధ్యతను వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. ఐఐఐటీ యాజమాన్యం విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా, కేవలం అధికంగా విద్య ఒత్తిడి చేయడం వల్ల విద్యార్థులు భయాందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అయన తెలిపారు. హైదరాబాద్ దోమలగూడ లోని ఆప్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్, డాక్టర్ సాల్మన్ రాజ్ లతో కలసి డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మహత్యలను నివారించి, విద్య ఒత్తిడిని తగ్గించి, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్ నేతృత్వంలో ఈ నెల 28 న అప్ "చలో బాసర ట్రిపుల్ ఐటీ" నిర్వహిస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తు గురించి భవ్యమైన కలలు కని ఐఐఐటీలో చేరిన విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకోవడం కలచివేస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు. 

దీనికి కారణం వినాశకాలపు విద్య విధానాలే అని పేర్కొన్నారు. భావి భారత దేశానికి నిజమైన సంపద విద్యార్థులేనని, వారికీ ఎలాంటి ఒత్తిడి లేకుండా నాణ్యమైన విద్య ను అందించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్య ను అందించి ప్రపంచ మేధావుల ప్రసంశలు అందుకుంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన మొదటి పని విద్య ప్రక్షాళన, భోదన, పరీక్షా విధానం, ఒత్తిడి తగ్గించడం వంటి విషయాలతోపాటు నీరజ కమిటీ నివేదికను అమలు చేయాలనీ దిడ్డి సుధాకర్ డిమాండ్ చేసారు. బుర్ర రాము గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలతో పాటు కార్పొరేట్ కళాశాలలు కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా కళాశాలలు నడుపుతూ విద్యార్థులకు సరైన వాతావరణం లేకుండా విపరీతమైన చదువు ఒత్తిడికి గురి చేస్తున్నారని అన్నారు.

 గ్రామీణ పేద విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తు కోసం ఐఐఐటీలో చేరుతున్నారని, వారికీ సరైన సౌకర్యాలు కల్పించకుండా ఒత్తడికి గురిచేయడంతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అయన తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని అయన ప్రశ్నించారు. డా. సాల్మన్ రాజ్ మాట్లాడుతూ బలవన్మరణాలను నివారించేందుకు విద్యార్థులను చైతన్య పరిచే బాధ్యత ప్రభుత్వానిదేనని, ప్రతి కళాశాలలో మానసిక వైద్య నిపుణులు నియమించి కౌన్సెలింగ్ ఇప్పించాలని కోరారు. ఈ నెల 28 న అప్ చలో బాసర ట్రిపుల్ ఐటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ డా. సాల్మన్ రాజ్ విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశంలో ఆప్ అధికార ప్రతినిధి ప్రవీణ్ గౌడ్, ఆప్ నేతలు పరీక్షణ్ రాజ్, టి. రాకేష్ సింగ్, ఎండి. మొబిన్, తేజ, సోహైల్ తదితరులు పాల్గొన్నారు.