జంగా రాఘవరెడ్డిని సస్పెండ్ చేయాలి

జంగా రాఘవరెడ్డిని సస్పెండ్ చేయాలి

కాంగ్రెస్ జిల్లా నేత అల్లం ప్రదీప్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ: కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్న జంగా రాఘవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆ పార్టీ జిల్లా నేత అల్లం ప్రదీప్ రెడ్డి అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాఘవరెడ్డి తనకు చేతకాక పాలకుర్తి నియోజకవర్గం వదిలేసి వెళ్లి.. రోజుకో మాట మాట్లాడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పాలకుర్తి నుంచి పారిపోయిన జంగాకు ఈ నియోజకవర్గం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

నియోజకవర్గంలో పనిచేస్తున్న నాయకుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న జంగాపై చర్యలు తీసుకోవాలని హైకమాండ్ ను కోరారు. పాలకుర్తిలో ఎవరు ఉన్నా.. లేకున్నా కాంగ్రెస్ పార్టీ బలం తగ్గదని స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో హై కమాండ్ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించేందుకు ఇక్కడి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.