సమస్యలపై పోరాడుదాం

సమస్యలపై పోరాడుదాం
  • వారం రోజుల్లో పరిష్కరించకుంటే చలో హైదరాబాద్​
  • తీర్మానించిన టీచింగ్ వైద్యుల సంఘం సర్వసభ్య సమావేశం

ముద్ర, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ వైద్యులపై ఒత్తిడి పెంచే విధంగా వ్యవస్థ నడుస్తుందని, ప్రధానంగా బదిలీలు, పీఆర్ సీ ఏరియర్స్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర టీచింగ్​ వైద్యుల సంఘం ఆరోపించింది. పెరిఫెరల్ కాలేజీలలో ఉన్న సమస్యల విషయంలో ప్రభుత్వం త్వరగా స్పందించాలని, లేదంటే ఇదే ఐక్యతను కొనసాగిస్తూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికి వెనకాడేది లేదని ఈ సందర్భంగా టీచింగ్​ వైద్యుల సంఘ నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర టీచింగ్ వైద్యుల సంఘం సభ్యుల సర్వసభ్య సమావేశం ఆదివారం కోఠిలోని  ఐఎంఎ హాల్ లో  జరిగింది. రాష్ట్రంలోని మొత్తం ముప్పై రెండు వైద్య కళాశాలల నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ల, అడిషనల్ డీఎంఇ. స్థాయి వరకు గల టీచింగ్ వైద్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న  సమస్యల గురించి కూలంకషంగా చర్చించారు. 

ప్రతి నెలా జరుగుతున్న రివ్యూ మీటింగ్ లో కేవలం టార్గెట్స్ ఇవ్వటమే కాక, వైద్యుల సమస్యల గురించి కూడా చర్చ జరగాలి ఈ సమావేశంలో ప్రతిపాదించారు. దేశంలో ఆరోగ్య గణాంకాలతో తెలంగాణ ఉత్తమ స్థాయిలో ఉందటే అది అందరి వైద్యుల సమిష్టి కృషి వల్లనే అని ప్రభుత్వం గుర్తించాలని, సమస్యల విషయంలో గత ఏడాది నిరసన తెలిపినప్పుడు, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి అందించిన భరోసాతో వెనకకు తగ్గామని గుర్తు చేశారు. కానీ, అందులో అనేక సమస్యలు అలాగే ఉన్నాయని సభ్యులు అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వానికి తెలిపాలని, వారం రోజుల్లో ప్రభుత్వం స్పందన లేకపోతే "ఛలో హైదరాబాద్​" అనే నినాదంతో టీచింగ్​ వైద్యులతో కోఠి లోని డీఎంఈ కార్యాలయం ముందు నిరసనకు దిగాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు డా. అన్వర్,  ప్రధాన కార్యదర్శి డా. జలగం తిరుపతి రావు, ఉపాధ్యక్షులు డా. కిరణ్ మాదాల, డా. ప్రతిభా లక్ష్మి, కోశాధికారి డా. కిరణ్ ప్రకాష్, రీజనల్ సెక్రెటరీ డా. ఎల్.రమేష్, డా. బాబు తదితరులు పాల్గొన్నారు.