అంచనాలకు మించిన నష్టం 

అంచనాలకు మించిన నష్టం 
  • రైతాంగానికి ఊహించని కష్టం
  • 21 మండలాల్లో వడగళ్ల వర్షం
  • 87350 ఎకరాల్లో  పంటలు నష్టం

సిద్దిపేట : ముద్ర ప్రతినిధి: సిద్దిపేట జిల్లాలో వడగళ్ల వానలతో అంచనాలకు మించిన నష్టమే జరిగింది. జిల్లాలో 24 మండలాలు ఉండగా 21 మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారమే జిల్లాలో 87,350 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. సమగ్ర సర్వే అనంతరం నష్టం సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలో రైతులకు ఊహించని కష్టం వచ్చింది. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి బాగా చితికిపోయారు. సిద్దిపేట జిల్లాలో ఈ నెల18న వడగళ్ల వర్షాలు ప్రారంభమయ్యాయి. 18వ తేదీ నుంచి 21వ తేదీ మధ్యలో మొదటి దఫా వానలు, వడగల్లు కురిసి 1146 ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు ధ్వంసమయ్యాయి. తర్వాత 24 న , తరువాత 26 న కురిసిన భారీ వడగళ్ల వర్షానికి  పెద్ద ఎత్తున పంటలు ధ్వంసం అయ్యాయి .ఫలితంగా 86204 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, మామిడి కూరగాయల తోటలు ధ్వంసం అయ్యాయి.

జిల్లాలో ములుగు, వర్గల్, మర్కుకు మండలాలు మినహా మిగిలిన అన్ని  మండలాల్లో వడగళ్ల వర్షం కురిసింది. రెండో దఫాలో కురిసిన వర్షం వడగళ్ల మూలాన 79,350 ఎకరాల్లో వరి పంట , ఎనిమిది వందల ముప్పై ఏడు ఎకరాల్లో మొక్కజొన్న, 5110 ఎకరాల్లో మామిడి తోటలు, 786 ఎకరాల్లో కూరగాయల తోటలు, 21 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంటలు ధ్వంసమయ్యాయి. కోతకు వచ్చిన వరి పంట వడగళ్ల దాటికి నేలపాలయింది. మామిడి కాయలు పెద్ద ఎత్తున రాలిపోవడంతో అపార నష్టం జరిగింది. మామిడి కాయలు చట్నీలు పెట్టుకునే సీజన్లో ఈ ఉత్పాతం జరగడంతో మార్కెట్లో మామిడికాయల ధరలకు రెక్కలు వచ్చాయి. పడగల వర్షాలు ఊహించని విధంగా వచ్చి తాము తీవ్రంగా నష్టపోయామని బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించే సీజన్లో ఈ ఉత్పాతం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు సమగ్ర సర్వే చేస్తున్నాం.

 జిల్లా వ్యవసాయ అధికారి కె. శివప్రసాద్

సిద్దిపేట జిల్లాలో ఊహించని విధంగా వడగళ్ల వర్షం మూడు దఫాలుగా కురిసిందని మొదటి దశ ఈ నెల 19 నుంచి 21 వరకు, రెండవ దఫా 24 వరకు, మూడవ దఫా ఈనెల 26 వరకు కురిసి పంటలన్నీ దెబ్బతిన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ తెలిపారు. మొదటి జరిగిన పంట నష్టానికి సంబంధించి  సర్వేను పూర్తిస్థాయిలో చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించామని  తెలిపారు. రెండవ, మూడవ దఫాల సర్వేల్లో తేడాలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. మొత్తం మీద 87,350 ఎకరాల్లో పంటలు పడగల వర్షం దాటికి ధ్వంసం అయ్యాయని ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. పూర్తిస్థాయిలో సర్వే చేసిన అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.