త్రిబుల్ ఆర్ భూ బాధితులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే పైళ్ళ

త్రిబుల్ ఆర్ భూ బాధితులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే పైళ్ళ
  • వారికి  న్యాయం జరగాలని మున్సిపల్ లో ఏకగ్రీవ తీర్మానం
  • బాధితులు రాజకీయ సుడిగుండంలో పడిపోవద్దు 
  • మీరంతా అండగా ఉంటే సమస్య పరిష్కారం కోసం నేనే ముందుంటా...
  • ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, భువనగిరి: రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం రాయగిరి ప్రాంత రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని,  నేను ముందుండి పోరాడుతానని  భువనగిరి  ఎమ్మెల్యే  ఆందోళన చేస్తున్న బాధితులకు హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రీజినల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని   దీక్ష చేస్తున్న ఆందోళన కారులను ఉద్దేశించి భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయగిరి ప్రాంతంలో చిన్న సన్నకారు రైతులే అధికంగా ఉన్నారని వారు గతంలోనే బైపాస్ రోడ్ బస్వాపురం కాలువల కింద భూములు కోల్పోయిన నష్టపోయారని , ఈ త్రిబుల్ ఆర్ వల్ల మరింత తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నందున  వారికి మేలు జరగాలని భువనగిరి మున్సిపాలిటీలో ప్రతిపక్షాలతో కలిపి రాయగిరి నుండి వెళ్లే రోడ్డు అలైన్మెంట్ మార్చాలని ఏకగ్రీవంగా ఏక వాక్య తీర్మానం  చేయడం జరిగిందని ఈ సందర్భంగా వివరించారు.

ప్రతిపక్షాలు సమస్యను ప్రక్కదోవ పట్టిస్తూ అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన తెలిపారు. సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులను కలవటానికి తాను ముందుండి నడుస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే , భూసేకరణ , నిర్మాణం మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం గాని ఒక ఎమ్మెల్యే పాత్ర గాని ఇందులో ఏ విధంగా ఉండదని వివరించారు.కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గాని, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యులు గానీ సమస్యను పరిష్కరించకుండా వారి పార్టీ వారే  ఆందోళన నిర్వహిస్తుండడం విడ్డూరంగా ఉందని, ఇది  భూ నిర్వాసితులైన పేద రైతులను  మోసం చేయడమేనని తెలిపారు.

కపట రాజకీయ నాయకుల  కబంధహస్తాల నుండి బయటపడి సమస్య పరిష్కారం కోసం రావాలని కోరారు.భువనగిరి మున్సిపల్ పరిధిలో ఎంతో విలువైన భూములు కాబట్టి వారికి ఇచ్చే నష్టపరిహారం అధిక మొత్తంలో ఉండే విధంగా, అలైన్మెంట్ పూర్తిగా మార్చే విధంగా అధికారులను కలిసేందుకు సంబంధిత రైతులంతా వస్తే తానే ముందుండి తీసుకెళ్తానని  దీక్ష విరమించి రావాలని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే తో పాటు భువనగిరి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ , రైతుబంధు సమితి అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.