భారతమాతను చంపేశారు

భారతమాతను చంపేశారు
  • మణిపూర్ రెండుగా చీలింది
  • బీజేపీ నేతలు దేశ ద్రోహులు  
  • మణిపూర్ బాధలు మీకు అర్థం కావా?
  • ప్రధాని మోడీ అక్కడకు ఎందుకు వెళ్లరు?
  • నేనక్కడ పర్యటించి బాధితులతో మాట్లాడా
  • బాధలు చెబుతూ మహిళలు స్పృహ కోల్పోయారు
  • లోక్​సభలో నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ 
  • రాహుల్ వ్యాఖ్యలతో బీజేపీ సభ్యుల ఆగ్రహం
  • క్షమాపణ చెప్పాలన్న మంత్రి కిరణ్ రిజిజు 
  • 140 కోట్ల మంది రక్షణ మోడీదే:  ఫరూక్​ అబ్దుల్లా
  • మోడీపై అవిశ్వాసం ఒక భ్రమ: అమిత్ షా  

(ముద్ర, నేషనల్ డెస్క్):-నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద  ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు బుధవారం జరిగిన చర్చలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. మణిపూర్‌లో మహిళలను హత్య చేయడమంటే భారత మాతను హత్య చేయడమేనని, మణిపూర్‌ను రెండు వర్గాలుగా విభజించారని ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానం మీద జరుగుతున్న చర్చలో రాహుల్ మాట్లాడుతూ హింసాత్మక ఘర్షణలు జరుగుతున్న మణిపూర్ రాష్ట్రంలో తాను పర్యటించానని అన్నారు. సహాయక శిబిరాలకు వెళ్లానని, దురాగతాలను ఎదుర్కొన్న మహిళలతో మాట్లాడానని తెలిపారు. కుమారుల మృతదేహాల వద్ద ఉన్న తల్లులతో మాట్లాడానని, భయానక సంఘటనల గురించి చెప్పేటపుడు ఆ మహిళలు స్పృహ కోల్పోయారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం ఆ రాష్ట్రంలో పర్యటించలేదని ఆరోపించారు. బీజేపీ ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించిందన్నారు. మణిపూర్ ఇక ఉండబోదని అన్నారు. మణిపూర్ మహిళల బాధలు బీజేపీకి అర్థం కావడం లేదన్నారు. భారతదేశ ఆత్మను ప్రభుత్వం హత్య చేసిందని, మణిపూర్‌లో భారత మాతను హత్య చేశారని ఆరోపించారు. బీజేపీ నేతలు ద్రోహులని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీని పరోక్షంగా రావణాసురుడితో పోల్చారు. రావణాసురుడు మేఘనాథుడు, కుంభకర్ణుడు చెప్పిన మాటలనే వినేవాడని, మోడీ కూడా ఇద్దరి మాటలనే వింటారని, వారిద్దరూ అమిత్ షా, అదానీ అని దుయ్యబట్టారు. 

  • క్షమాపణ చెప్పాలి

రాహుల్ వ్యాఖ్యలతో అధికార పక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో గందరగోళం ఏర్పడింది. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. ఆయన ఈశాన్య రాష్ట్రాలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా రాహుల్ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. అవినీతి, వారసత్వ రాజకీయాలు భారత దేశాన్ని విడిచిపెట్టిపోవాలన్నారు. ‘మీరు ఇండియా కాదు.. అవినీతికి ప్రతిరూపం’ అన్నారు. మణిపూర్ విడిపోలేదన్నారు. మణిపూర్ భారత దేశంలో అంతర్భాగమన్నారు. దేశంలో ఎంతో మందిని హత్య చేసిన చరిత్రగల కాంగ్రెస్ భారత దేశాన్ని హత్య చేసినట్లు చెప్పడంలో అర్థం లేదన్నారు. దేశంపట్ల తమకు చిత్తశుద్ధి ఉందని, కాంగ్రెస్ పార్టీకి అటువంటి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. మణిపూర్‌ను ఎవరూ విభజించలేరని, ముక్కలు చేయలేరని స్పష్టం చేశారు.

  • మోడీ 140 కోట్ల మంది ప్రజలకు  ప్రధాని 

నరేంద్ర మోడీ 140 కోట్ల మంది దేశ ప్రజలకు  ప్రధాని అని నేష‌న‌ల్ కాన్ఫరెన్స్​నేత‌ ఫ‌రూక్ అబ్దుల్లా  అన్నారు. ప్రధాని ఏ ఒక్క వ‌ర్గానికో, వ‌ర్ణానికో ప్రాతినిధ్యం వ‌హించ‌ర‌ని స్పష్టం చేశారు. దేశం కేవ‌లం హిందువులే కాకుండా ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు స‌హా దేశంలో నివ‌సిస్తున్న ప్రతి ఒక్కరి బాధ్యతనూ త‌ల‌కెత్తుకోవాల‌ని వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించినా, మహిళలపై అత్యాచారాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ లోక్‌సభా పక్షనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. 

  • మోడీపై అవిశ్వాసం ఒక భ్రమ 

కేంద్రంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోమంత్రి అమిత్‌షా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ఈ సభలో ఒక వ్యక్తి 13 సార్లు రాజకీయ కెరీర్ ప్రారంభించి, 13 సార్లు విఫలమయ్యారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. ఇందులో ఒక సందర్భం తాను చూశానని, ఆ వ్యక్తి బుందేల్‌ఖండ్‌కు చెందిన కవిత అనే పేద మహిళను కలుసుకున్నారని, ఆమెకు చేసిందేమీ లేదని, మోడీ ప్రభుత్వమే ఆమెకు ఇల్లు, రేషన్, విద్యుత్ సౌకర్యం కల్పించిందని చెప్పారు.  ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఒక్క సరైన అంశం కూడా లేదని ఇంతవరకూ జరిగిన చర్చతో రుజువైందన్నారు. ప్రధానిపై, కానీ ప్రభుత్వంపై కానీ అసలు అవిశ్వాసమన్నదే లేదని, లేనిదాన్ని ఉన్నట్టు చూపించే ఒక భ్రమను సృష్టించేందుకే అవిశ్వాస తీర్మానం తెచ్చారని విపక్షాలను విమర్శించారు. దేశ ప్రజలు, పార్లమెంటుకు నరేంద్ర మోదీపై పరిపూర్ణ విశ్వాసం ఉందన్నారు. మోడీ దేశం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని, ఒక్క సెలవు కూడా తీసుకోకుండా రోజుకు 17 గంటలు పనిచేస్తున్నారని, ప్రజలు ఆయనను విశ్వసిస్తున్నారని అన్నారు. 

  • స్పీకర్ కు ధన్యవాదాలు

అంతకు ముందు రాహుల్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ‘స్పీకర్ సార్, లోక్ సభలో నన్ను పునర్నియమించినందుకు ధన్యవాదాలు. గతంలో నేను మాట్లాడినపుడు, అదానీ మీద, మీ సీనియర్ నేతల మీద ఎక్కువ దృష్టి పెట్టాను. అందువల్ల నేను బహుశా మిమ్మల్ని బాధించి ఉంటాను. ఈరోజు నేను అదానీ గురించి మాట్లాడను’ అని చెప్పారు. సుప్రసిద్ధ పర్షియన్ కవి రూమీని ప్రస్తావిస్తూ, తాను బీజేపీ మీద అన్ని వైపుల నుంచి దాడి చేయబోవడం లేదన్నారు. ఈరోజు తాను తన హృదయాంతరాళాల్లోంచి మాట్లాడాలనుకుంటున్నానని చెప్పారు. తాను ఎల్లప్పుడూ చేసే విధంగా ఈసారి ప్రభుత్వంపై భీకరంగా విమర్శల దాడి చేయబోనన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా తనకు చాలా మంది గొప్ప శక్తిని, బలాన్ని అందించారన్నారు. ఈ యాత్రలో తనకు ఓ బాలిక ఓ లేఖ ఇచ్చిందని, అందులో ‘రాహుల్, నేను మీతో కలిసి నడుస్తున్నాను’ అని ఉందన్నారు. ఆమె మాత్రమే కాకుండా అనేక మంది తనకు బలాన్ని ఇచ్చారని చెప్పారు. తనకు బలాన్నిచ్చినవారిలో రైతులు ఉన్నారన్నారు. ఈ యాత్రకు వెళ్లే ముందు తనలో అహంకారం ఉండేదని, అహంకారంతోనే తాను ఈ యాత్రను ప్రారంభించానని చెప్పారు. ఈ యాత్ర తన జీవితాన్ని మార్చేసిందన్నారు. ఈ యాత్రలో నిజమైన భారత దేశాన్ని చూశానని తెలిపారు. యాత్ర కోసం అన్నిటినీ త్యాగం చేయడానికి సిద్ధమయ్యానన్నారు. ప్రజా గళాన్ని విన్నానని చెప్పారు. ఈ యాత్రలో ప్రజలు తనకు ఎంతో సహాయం చేశారని, పేదల బాధలను అర్థం చేసుకున్నానని చెప్పారు.

  • పెద్దల సభ నుంచి కాంగ్రెస్​వాకౌట్​ (బాక్స్​)

మ‌ణిపూర్ అంశంపై స‌మ‌గ్ర చ‌ర్చ జ‌ర‌గాల‌ని తాము కోరుకుంటుంటే ప్రధాని న‌రేంద్ర మోడీ మాత్రం స‌భ‌కు వ‌చ్చేందుకు సిద్ధంగా లేర‌ని రాజ్యస‌భ‌లో విప‌క్ష నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. స‌భ‌లో మ‌ణిపూర్ వ్యవ‌హారంపై చర్చ జ‌రిగితే కొన్ని వివ‌రాలు వెలుగుచూసే అవ‌కాశం ఉంటుందనే త‌మ ఉద్దేశ‌మ‌ని చెప్పారు. మ‌ణిపూర్ అల్లర్లపై ప్రతిప‌క్ష స‌భ్యులు చెప్పే విష‌యాల‌ను వినేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేద‌ని, అందుకు నిర‌స‌న‌గా తాము స‌భ నుంచి వాకౌట్ చేస్తామ‌ని ఖ‌ర్గే స్పష్టం చేశారు. ఖర్గే ప్రకటన తర్వాత కాంగ్రెస్ ఎంపీలు పెద్దల స‌భ నుంచి వాకౌట్ చేశారు. 

  • రాహుల్ ఫోబియాలో స్మృతి ఇరానీ

కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ..  రాహుల్ ఫోబియాతో బాధ‌ప‌డుతున్నార‌ని, ఆమె ఈ ఫోబియా నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ అన్నారు. లోక్‌సభ‌లో రాహుల్ అభ్యంత‌ర‌క‌రంగా ప్రవ‌ర్తించాడ‌ని స్మృతి ఇరానీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా ప్రసంగం ముగిసిన త‌ర్వాత ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడ‌ని స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఇక రాహుల్ త‌ర్వాత అవిశ్వాస తీర్మానంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రవ‌ర్తన స‌రిగా లేద‌ని, బీజేపీ మ‌హిళా ఎంపీల‌కు రాహుల్ ఫ్ల‌యింగ్ కిస్ ఇచ్చిన‌ట్లు ఆరోపించారు. దీనిపై ఠాగూర్​ మాట్లాడుతూ స్మృతి ఇరానీ.. ఇంకా రాహుల్​ ఫోబియాతో ఉన్నారంటూ లోక్​సభలో అన్నారు.