మెగా డీఎస్సీ ప్రకటించాలి

మెగా డీఎస్సీ ప్రకటించాలి
  • టీఆర్టీ అభ్యర్థుల భారీ ర్యాలీ 
  • విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి యత్నం
  • స్వల్పంగా పోలీసుల లాఠీ చార్జి

ముద్ర, తెలంగాణ బ్యూరో : మెగా డీఎస్సీ ప్రకటించాలని కోరుతూ టీఆర్టీ అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. మంగళవారం హైదరాబాద్ లో రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య నేతత్వంలో టీఆర్టీ అభ్యర్థులు భారీ ర్యాలీ నిర్వహించి పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ క్రమంలో అభ్యర్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు, అభ్యర్థుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేయడంతో అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి అసెంబ్లీ వైపు పరుగులు తీశారు. వారిని పోలీసులు అడ్డుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇటీవల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 5,089 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని టీచర్ పోస్టులను భర్తీ చేయాలని టీఆర్టీ అభ్యర్థులు డిమాండ్ చేశారు. కేవలం ఐదువేల పోస్టులను భర్తీ చేస్తే ఏం లాభమని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 

లాఠీచార్జిని ఖండించిన ఏఐఎస్ఎఫ్

టీఆర్టీ అభ్యర్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జిని ఏఐఎస్ఎఫ్ నేతలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో 22 వేల టీచర్ పోస్టులు ఖాళీలు ఉంటే, కేవలం 5 వేలు మాత్రమే భర్తీ చేస్తూ కేసీఆర్ సర్కార్ నిరుద్యోగుల పట్ల వివక్షత చూపుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ మండిపడ్డారు.