గొంగళి పురుగులాంటి ఖమ్మంను సీతాకోక చిలుకలా మార్చా

గొంగళి పురుగులాంటి ఖమ్మంను సీతాకోక చిలుకలా మార్చా
  • అజయ్ ప్రచార జోరు
  • ప్రజలకు అండగా ఉన్నా
  • మంత్రి, ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం, ముద్ర : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రోడ్డు షో, ఆత్మీయ సమ్మేళనం, ఇంటింటి ప్రచారంలో తనకు అండగా నిలవాలని ఓటర్లను కోరుతున్నారు. రెండు సార్లు ఆదరించిన తనను మూడో సారి కూడా అసెంబ్లీకి పంపించాలని కోరారు. సోమవారం ఖమ్మం నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహించారు.  ఖమ్మం నగరం 15, 43, 46, 48వ డివిజన్ లో బీఆర్ఎస్ శ్రేణుల నడుమ భారీ రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా ప్రచారం వాహనంపై నుండి ప్రజలను పలకరిస్తూ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయా డివిజన్లలో పలు కూడళ్లలో ప్రజలనుద్దేశించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  మాట్లాడారు. ఈ ఎన్నికలు ఖమ్మం భవిష్యత్ కి సంబందించిన ఎన్నికలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంత అభివృద్ధి చెందింది ఖమ్మం నియోజకవర్గమేనని తెలిపారు. మంత్రులు కేటీఆర్, హరీశ్​ రావు ఖమ్మం అభివృద్ధి గురించి చాలా సందర్భాల్లో గొప్పగా చెప్పారని గుర్తు చేశారు. మున్నేరు వరదల సమయంలో తాను రాత్రి వరకు ప్రజల మధ్య ఉండి, ముంపులో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చానని తెలిపారు. వరదల సమయంలో అంతా కష్టపడి ఒక్క ప్రాణం పోకుండా చూశామన్నారు. ముంపుకు గురైన ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసి, ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం కింద రూ.8వేలు అందించానన్నారు. తన మీద పోటీ చేసే అభ్యర్థి 40 ఏళ్లుగా ప్రజలకు కష్టమొస్తే పలకరించిన పాపాన పోలేదన్నారు.

కరోనా సమయంలో సైతం తాను ప్రజల మధ్య ఉంటూ కరోనా వచ్చిన ప్రజలను వీడలేదన్నారు. మూడోసారి హ్యాట్రిక్ విజయం అందుకునేలా ఆశీర్వదించాలని కోరారు. మున్నేరు బ్రిడ్జిపై తీగల వంతెనకు నిధులు తీసుకొచ్చానని తెలిపారు. ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థి గతంలో లకారం చెరువు, గోళ్లపాడు ఛానెల్ ఆధునీకరణను గాలికి వదిలేసిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని ఎలా గెలిపిస్తారని ప్రశ్నించారు. తాను చేసిన అభివృద్ధిని కూడా ఆయనే చేసినట్లు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. దీనిని చూస్తుంటే మందికి పుట్టిన బిడ్డను తనకు పుట్టినట్లుగా చెప్పుకున్నట్లు ఉందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన పనులను టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధి చేశా అంటే ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.

అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అజయ్ అన్న అంటే ధైర్యం..  నేను కావాలా, స్థానికేతరుడు కావాలా ఆలోచించండని ఓటర్లను కోరారు. గతంలో గొంగళి పురుగులా ఉన్న ఖమ్మం నగరాన్ని, నేడు సీతాకోక చిలుక లా చేశానన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఖమ్మం నగర అభివృద్ధినీ గాలికి  వదిలేస్తే, అభివృద్ధి చేసింది తానేనని తెలిపారు. కేవలం రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి, పోలింగ్ ఏజెంట్ లుగా మీరే నిర్ణయించుకోని, తనను గెలిపించాలని పువ్వాడ కోరారు. మొదటి ఈవీఎంలో మొదటి స్థానంలో ఉన్న కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. కాగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  హ్యాట్రిక్ విజయాన్ని కాంక్షిస్తూ  ఖమ్మం నగరంలో పలు డివిజన్ల లో  మంత్రి అజయ్ సతీమణి పువ్వాడ వసంత లక్ష్మీ ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధికి అహంకారానికి జరుగుతున్న పోరులో అభివృద్ధి వైపు నిలవాలని కోరారు. ఖమ్మం నగరాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన అజయ్ కుమార్ కు  అండగా నిలవాలని కోరారు.