కన్నుల పండుగగా నరసింహుని రథోత్సవం...

కన్నుల పండుగగా నరసింహుని రథోత్సవం...
  • వేలాదిగా తరలివచ్చిన భక్తులు..
  • గోవిందా నామస్మరణ తో మారుమ్రోగిన వీధులు
  • పాల్గొన్న మంత్రి కొప్పుల..

ముద్ర,ధర్మపురి; ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.ఉత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీ యోగ,ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి వారల రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఉదయం ప్రత్యేక పూజలు హోమం, పూర్ణాహుతి, బలిహారణం,తదితర పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం వేలలో స్వామివారి ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించిన రథముల పై ఉంచగా భక్తులు బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు.

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్వామివారి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.సాయంత్రం వేళలో భక్తుల జయజయ ధ్వనులు మధ్య భక్త జనులు తోడు రాగా నంది చౌక్ వరకు రథోత్సవం జరిపారు. అనంతరం స్వామివారికి చక్రతీర్థం,పుష్పయాగం నిర్వహించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చారు. పవిత్ర గోదావరి నది లో పుణ్య స్నానాలు ఆచరించి రథోత్సవ స్వామి ని దర్శించుకున్నారు. సిఐ బిల్లా కొటేశ్వర్, ఎస్ఐ ఏలూరి కిరణ్ కుమార్ లు ఎటువంటి అవాంతరాలు లేకుండా  భద్రత ఏర్పాట్లు చేశారు.