మినీ స్టేడియం లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

మినీ స్టేడియం లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

ధ్యాన్ చంద్ స్పూర్తితో క్రీడలలో దేశానికీ పేరు ప్రతిష్టలు తీసుకురావాలి

జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్

సిరిసిల్ల టౌన్, ముద్ర: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలనీ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ అన్నారు. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం ను మంగళవారం జిల్లా కేంద్రం సిరిసిల్ల లోని రాజీవ్ నగర్ మినీ స్టేడియంలో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మినీ స్టేడియం అవరణ లోని మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ ఒలంపిక్ క్రీడల్లో పాల్గొని భారతదేశానికి హాకీలో స్వర్ణ పతకం తేవడంలో విశేషంగా కృషి చేశారన్నారు. అప్పటి జర్మనీ అధ్యక్షుడు హిట్లర్ కూడా ధ్యాన్ చంద్ ఆటకు ముగ్ధుడై వారిని తన దేశం తరఫున ప్రాతినిధ్య వహించమని కోరడం వారి గొప్పతనానికి నిదర్శనం అన్నారు. స్వయంకృషితో కష్టపడిన ధ్యాన్ చంద్ ఇటు క్రీడల్లో అటు సైన్యంలో సేవలను అందించి హాకీ క్రీడ కు గుర్తింపు తీసుకువచ్చారన్నారు. ధ్యాన్ చంద్ ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు, యువకులు క్రీడలలో రాణించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామాల నుండి క్రీడాకారులను తయారు చేయాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటుచేసి ఆయా గ్రామాల్లో యువకులు విద్యార్థులు క్రీడల్లో రాణించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతిరోజు విద్యార్థులు కనీసం అరగంట పాటు వ్యాయామం, క్రీడల్లో పాల్గొంటే శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. నేడు యువకులు గ్రామాలలో, పట్టణాలలో సెల్ ఫోన్లు కు పరిమితమై క్రీడల పట్ల ఆసక్తి చూపడం లేదని ఇది మంచి పద్ధతి కాదన్నారు. సిరిసిల్ల పట్టణంలో అధునాతన వసతులతో నిర్మించిన మినీ స్టేడియంను యువకులు, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, జిల్లా యువజన క్రీడా అధికారి రాందాస్ లు విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా అదనపు కలెక్టర్ జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మహిళల వాలీ బాల్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, యువకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.