మన దేశం ఆర్థిక శక్తిగా మరింత ఎదగాలి..

మన దేశం ఆర్థిక శక్తిగా మరింత ఎదగాలి..
  • విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి..
  • కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రెటరీ  సందీప్..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: మన భారతదేశం మరింత ఆర్థిక శక్తిగా ఎదగాలని, విద్య, వైద్య,ఆరోగ్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించాలని కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రెటరీ, ఐఎఫ్ఎస్ సందీప్  అన్నారు. ఆస్పిరేషన్ సంబంధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పురోగతి పై గురువారం జెన్కో సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో వారు రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలు పూర్తి సంతృప్తికరంగా ఉన్నాయని, విద్య ,వైద్య, ఆరోగ్య రంగాలలో జరుగుతున్న పురోగతి కార్యక్రమాలు మరింత ఉత్సాహవంతంగా కొనసాగించాలని, విద్యారంగంలో వైద్యరంగంలో మంచి కృషిచేసిన అధికారులకు అభినందనలు తెలిపారు.  గతంలో కంటే ప్రస్తుతం భారతదేశంలో పరిశుభ్రతపై అవగాహన పెరిగిందని, హైదరాబాద్ లాంటి నగరంలో కూడా రోడ్డుపై చెత్త వేయడం 80శాతం మేర తగ్గి పోయిందని అన్నారు. ప్రపంచంలోనే మన భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని, మరో 7 సంవత్సరాల కాలంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లేందుకు గాను మన విద్యార్థులను సన్నద్ధం చేసి, వారికి మెరుగైన శిక్షణ నైపుణ్యాలు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

 జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. దేశంలో ఆస్పిరేషనల్ జిల్లాలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గత సెప్టెంబర్ మాసంలో 81వ ర్యాంకింగ్ లో ఉందని, ప్రస్తుత జనవరి నెలకు సంబంధించి విడుదల చేసిన ర్యాంకింగ్ లో 31 స్థానానికి చేరుకోవడం జరిగిందని తెలిపారు. దీనికోసం విద్య వైద్యం వ్యవసాయం, కనీస మౌలిక వసతులు తదితర రంగాలలో చేసిన కృషి గురించి వివరించారు. ఆరోగ్య శాఖకు సంబంధించి గర్భిణీ మహిళల ఏఎన్సి రిజిస్ట్రేషన్ 97%, పౌష్టికాహార 98%, ఆస్పత్రులలో డెలివరీస్ 100%, సామ్, మ్యామ్ పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గించామని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ఎనీమియా నుంచి సంరక్షించేందుకు గత డిసెంబర్ నుంచి కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ అనే పథకం అమలు చేస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యారంగంలో 100% పాఠశాలలో త్రాగునీరు సరఫరా ఉందని, పిల్లలకు పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామని, 99.57% పాఠశాలల్లో ఉపాధ్యాయుల నిష్పత్తి సక్రమంగా ఉందని, 96.11% పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేకంగా నీటి సరఫరాతో కూడిన టాయిలెట్స్ ఉన్నాయని తెలిపారు.

విద్య రంగంలో 12 రకాల మౌలిక వసతులు కల్పిస్తూ పాఠశాలలను కార్పోరేట్ కు ధీటుగా తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం  మన ఊరు మనబడి కార్యక్రమాన్ని అమలు చేస్తుందని, మన జిల్లాలో మొదటి దశలో 149 పాఠశాలలో పనులు చేపట్టామని, మార్చి చివరి నాటికి పూర్తి చేయడం జరుగుతుందని వివరించారు. దిశ స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యం అవుతూ విద్యార్థులలో ఆంగ్ల పదాల పరిజ్ఞానం పెంచే దిశగా 11 పాఠశాలలలో స్మార్ట్ టీవీలు అందించామని, హె.డి.ఎఫ్.సి బ్యాంకు సి ఎస్ ఆర్ నిధుల తో 31 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్ లో ఏర్పాటు చేశామన్నారు. బైజుస్ వారి ఆధ్వర్యంలో జిల్లాలో 35 మంది ఇంటర్ విద్యార్థులను ఎంపిక చేసి  జేఈఈ, నీట్ కు సంబంధించిన కోచింగ్ మెటీరియల్ తో కూడిన ట్యాబులు పంపిణీ చేశామని, జయశంకర్ భూపాలపల్లి జిల్లాను మిల్లెట్ హబ్ గా తీర్చి దిద్దేందుకు  చర్యలు తీసుకుంటున్నామని, గత సంవత్సరం 644 మంది రైతులు 811 ఎకరాలలో వానకాలం యాసంగిలో కలిపి మిల్లెట్ సాగు చేశారని, 1.36 కోట్ల విలువగల విత్తనాలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశామని, చెల్పూరు వద్ద రూ.10 లక్షల తో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశామని తెలిపారు. వ్యవసాయ రంగంలో  ఆయిల్ పామ్ పంట సాగు ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సబ్సిడీ అందజేస్తున్నామని, జిల్లాలో ఇప్పటివరకు 622 మంది రైతులు 1934 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని కలెక్టర్ వివరించారు.

సమావేశం అనంతరం అదనపు కలెక్టర్, ఇతర ఆధికారులతో కలిసి కేంద్ర జాయింట్ సెక్రెటరీ సందీప్ గణపురం మండలం చెల్పూర్ లోని  జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రం, ప్రాసెసింగ్ ప్లాంట్ ను, గణపురం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మండల ప్రజా పరిషత్ పాఠశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలో చేపడుతున్న పలు కార్యక్రమాల పట్ల అధికారులను అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, డిఆర్డిఏ పిడి పురుషోత్తం, సిపిఓ, డిడబ్ల్యు శామ్యూల్, డిపిఓ ఆశాలత, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్, డీఈఓ రామ్ కుమార్, డిఏఓ విజయభాస్కర్, డిస్టిక్ ఆర్టికల్చర్ అధికారి సంజీవ రావు, ఎం.పి.డి.ఓ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.