మహిళా దినోత్సవం రోజున ఒక మహిళకు ఈడీ నోటీసులా..?

మహిళా దినోత్సవం రోజున ఒక మహిళకు ఈడీ నోటీసులా..?

బి.ఆర్.ఎస్ ను దెబ్బతీసేందుకే కవితకు నోటీసులు

కాటారం, ముద్ర న్యూస్: టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతిష్టను దెబ్బతీసేందుకే లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,పీఏసీఎస్ చైర్మెన్ చల్లా నారాయణ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పై బిజెపి ప్రభుత్వం కుట్ర ఇదని అన్నారు.గురువారం కాటారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చల్ల నారాయణరెడ్డి మాట్లాడుతూ కవితను అరెస్టు చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.60 లక్షల మంది సభ్యత్వం కలిగిన బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలతో పాటు నాలుగు కోట్ల ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి వెన్నంటి ఉంటారని తెలిపారు. బిజెపి చేసే కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారని నారాయణరెడ్డి పేర్కొన్నారు.

దేశంలో బిఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే బిజెపి ప్రభుత్వం ఈడి, సిబిఐ సంస్థలను వాడుకుంటోందని అన్నారు.మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కోసం డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని ఆపేందుకు బిజెపి కుయుక్తులు పన్నుతోందని నారాయణరెడ్డి ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వాన్ని ప్రజలు కూకట్వేలతో కూలదొస్తారని రాష్ట్రంలో బిజెపి పార్టీని ప్రజలు నమ్మడం లేదని నారాయణరెడ్డి అన్నారు. ఈ సమావేశంలో బి.ఆర్.ఎస్ నాయకులు దబ్బెట రాజేష్, మాజీ జెడ్పిటిసి దుర్గం మల్లయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ దబ్బేట స్వామి,మోయిజ్ ఖాన్, జిల్లెల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.