బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేసే వారిపై జరిమానా విధించాలి

బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేసే వారిపై జరిమానా విధించాలి
  • అనుమతులు లేకుండా పొగాకు ఉత్పత్తులు అమ్మే వారిపై కఠిన చర్యలు: జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్  

ముద్ర సిరిసిల్ల టౌన్:-పొగాకు ఉత్పత్తులను, వాడకాన్ని జిల్లాలో నియంత్రించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా అధికారులను రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్ ఆదేశించారు. గురువారం జిల్లా  కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో జాతీయ పొగాకు ఉత్పత్తుల నియంత్రణ, సిగరేట్స్‌, టొబాకో ప్రాజెక్ట్సు యాక్ట్‌- 2003 ను అనుసరించి జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం జిల్లా అదనపు కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో పొగాకు ఉత్పత్తుల నియంత్రణ పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. పొగాకు ఉత్పత్తుల వాడకం వలన కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలలో పొగాకు వాడకం, ధూమపానం వల్ల వచ్చే వ్యాధులపై గోడపత్రికలు, కర పత్రాలు, ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవగాహన సమావేశాలు నిర్వహించాలని చెప్పారు.

పొగాకు వల్ల బీడీ కార్మికులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్న దృష్ట్యా వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. భారత దేశంలో అమలులో ఉన్న పొగాకు నియంత్రణ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాలలో, ఆఫీసులలో పొగ త్రాగడం నేరమన్నారు. అలాగే అన్ని పొగాకు ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం విధించారని చెప్పారు. 18 సంవత్సరాల కంటే చిన్న పిల్లలకు వీటిని అమ్మడం నేరమన్నారు. అలాగే స్కూలు, కాలేజీ ఆవరణము నుండి 100 గజాల దూరం వరకు ఉత్పత్తులను అమ్మడం నేరమని, అన్ని పొగాకు ఉత్పత్తుల పైన చిత్రంతో కూడిన హెచ్చరికను తప్పకుండా ముద్రించాల్సి ఉంటుందన్నారు. ఈ నిబంధనలు ఖచ్చితంగా జిల్లాలో తప్పకుండా అమలు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం జరిమానాలు విధించాలన్నారు.  ఆ విషయాలను ప్రజలందరికీ చేరేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. అనుమతులు లేకుండా పొగాకు ఉత్పత్తులు అమ్మే వారిపై ఉక్కు పాదం మోపాలని జిల్లా అదనపు కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుమన్ మోహన్ రావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రజిత, జిల్లా కార్మిక అధికారి రఫీ, డిపిఆర్ఓ మామిండ్ల దశరథం, తదితరులు పాల్గొన్నారు.