పెండింగ్ బిల్లు లను విడుదల చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు (యుఎస్ పిసి)ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ అధ్వర్యంలో నిరసన

పెండింగ్ బిల్లు లను విడుదల చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు (యుఎస్ పిసి)ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ అధ్వర్యంలో నిరసన
  • ఈ-కుబేర్ లో ఉన్న పెండింగ్ బిల్లులని వెంటనే విడుదల చేయాలి
  • ప్రతినెల ఒకటో తేదీనే వేతనాలు జమ చేయాలి
  • ఉద్యోగ ఫ్రెండ్లీ అనేది మాటల వరకు మాత్రమే
ముద్ర సిరిసిల్ల టౌన్: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ ఆర్ధిక బిల్లుల చెల్లింపులలో తీవ్ర కాలయాపన జరుగుతున్నదని, ఉద్యోగ ఫ్రెండ్లీ గా చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం చేతలలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధముగా ప్రవర్తిస్తున్నదని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భముగా రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు యుఎస్ పిసి ఆధ్వర్యం లో నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులు, జిపిఎఫ్ లోన్లు, పాక్షిక ఉపసంహరణ బిల్లులు, సంపాదిత సెలవుల అమ్మకపు బిల్లులు, డి.ఏ బకాయిల బిల్లులు, పిఆర్ సి బకాయి బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు మొదలగు వాటిని చెల్లించకుండా ప్రభుత్వం తీవ్ర కాలయాపన చేస్తుందని దాని ద్వారా ఉపాధ్యాయులు తీవ్ర నిర్వేదం లో ఉన్నారని అన్నారు.

మార్చ్ 31 లోపు ఈ కుబేర్ లో పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లుల్ని చెల్లించాలని లేదంటే మళ్ళీ అన్ని బిల్లులు మొదటికే వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఈ రకమైన బిల్లులు రెండు నుంచి ఐదు రోజుల్లో చెల్లించే వారని ఇప్పుడు సంవత్సరం వరకు కూడా అతీ గతీ ఉండడం లేదని, అన్ని రకాల బిల్లుల చెల్లింపులో నెలల తరబడి ఎదురు చూపులకు స్వస్తి పలకాలని, ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న కాలంలో ఎన్నో సమస్యల తో సతమతం అవుతున్న ఉపాధ్యాయులు వాటిని పక్కనబెట్టి సకాలంలో జీతాలు చెల్లించాలని కూడా ఉద్యమించాల్సిన దుస్థితి ఏర్పడిందని బాధపడుతున్నామని అన్నారు.
ఆర్థిక శాఖ అధ్వర్యంలోని ఈ-కుబేరులో నెలల తరబడి పెండింగులో ఉన్న అన్ని రకాల బిల్లులను మార్చి నెల 31లోగా చెల్లించాలని, ప్రతినెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని,ఎయిడెడ్,కెజిబివి, ఆదర్శ  పాఠశాలల ఉపాధ్యాయుల వేతనాలు ,రిటైర్డ్ ఉద్యోగుల పెన్సన్ లని సకాలం లో చెల్లించాలని డిమాండ్ చేసారు .అనంతరం జిల్లా ఖజానా అధికారికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలోయుఎస్ పిసి నాయకులు పాకాల శంకర్ గౌడ్, దోర్నాల భూపాల్ రెడ్డి, దొంతుల శ్రీహరి, వుత్తం విజయ్ కుమార్, మహేందర్ రావు, దుమాల రమానాథ్ రెడ్డి, అవురం సుధాకర్ రెడ్డి, కర్రోళ్ల రాజలింగం, రాష్ట్ర బాధ్యులు బూర సదానందం, పూరెల్లి రవీందర్ లతో పాటుపెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు.