దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత

  • రూ.4,016 పింఛన్ పెంచిన ఘనత కేసీఆర్ దే
  • ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేనంత పింఛన్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. శనివారం మెదక్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యాశాఖ, సమగ్ర శిక్షణ, అలింకో ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. ముఖ్యతిధిగా హాజరైన ఎమ్మెల్యే పద్మ 182 మంది దివ్యాంగులకు రూ.12.90 లక్షలు విలువచేసే 256 పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కెసిఆర్ దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ రూ.1,500 పింఛన్ ను రూ.4,016 పెంచుతూ ఇటీవల మన మెదక్ లోనే సభలో దివ్యాంగులకు అందజేసినట్లు చెప్పారు. దివ్యాంగులు సదరం క్యాంపులకు వెళ్లి సర్టిఫికెట్ పొంది ఉండాలని, 45 శాతం అంగవైకల్యం ఉన్నవారికి పెన్షన్ మంజూరు అవుతుందని చెప్పారు. గతంలో సంగారెడ్డి వెళ్లి సర్టిఫికెట్ పొందే వారిని ప్రస్తుతం మన మెదక్ లోనే ఈ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సర్టిఫికెట్ పొందిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, వారికి త్వరలోనే పింఛన్ మంజూరు అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ మునిసిపల్ ఛైర్మెన్ చంద్రపాల్, జిల్లా విద్యాధికారి రాధా కిషన్, ఎంఈఓ నీలకంఠం,  సి. డబ్ల్యూ. ఎస్. ఎన్ అధికారి సతీష్, అలింకో ప్రతినిధులు సునీత, కైలాష్, ప్రధానోపాధ్యాయులు అంజగౌడ్, మెదక్ మునిసిపల్ మాజీ వైస్ చేర్మెన్ రాగి అశోక్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రామాయంపేట రెవిన్యూ డివిజన్,  ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయడం పట్ల రామయంపేటకు చెందిన రాజన్ దివ్యాంగులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.