కర్ణాటక కదన రంగంలోకి శరద్ పవార్ పార్టీ

కర్ణాటక కదన రంగంలోకి శరద్ పవార్ పార్టీ

న్యూఢిల్లీ: ఉత్కంఠ భరితంగా సాగనున్న కర్ణాటక ఎన్నికల రంగంలోకి శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రవేశిస్తున్నది. దీంతో కాంగ్రెస్ శిబిరంలో ఆందోళన మొదలైంది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్ (యునైటెడ్) పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరుగనున్న 40 నుంచి 45 స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దింపాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)నిర్ణయించింది. ప్రతిపక్షాల ఐక్యత  పేరిట శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీ నేతలను కలుసుకున్న మరుసటిరోజే ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తున్నది.

ఎన్సీపీ ఇటీవల జాతీయ పార్టీ హోదాను కోల్పోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. తాము కోల్పోయిన జాతీయ హోదాను తిరిగి పొందాలంటే ఈ పోటీ తప్పనిసరి అని ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్ మీడియా వర్గాలకు చెప్పారు. అయితే ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుంది. కర్ణాటక ఎన్నికల కదన రంగంలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఎన్సీపీ మనసు మార్చుకోకపోతే కాంగ్రెస్ ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది.