వైద్య రంగంలో తెలంగాణ అగ్రగామి

వైద్య రంగంలో తెలంగాణ అగ్రగామి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ముద్ర ప్రతినిధి, జనగామ: వైద్య రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, మన రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ దిశగా తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్‌‌ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన పోస్ట్ మార్టం గదిని మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీతి ఆయోగ్ విడుదల చేసిన 2021 హెల్త్ ఇండెక్స్‌లో ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ 3వ స్థానంలో, పురోగతిలో మొదటి స్థానంలో, వ్యాక్సినేషన్, ప్రసవాల పురోగతిలో టాప్‌లో ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళశాల కూడా ఇవ్వకున్నా.. ఆరోగ్య తెలంగాణలో భాగంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేశారని తెలిపారు.  

అలాగే హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిని అదనంగా రెండు వేల పడకలకు పెంచడంతో పాటు హైదరాబాద్ నగరం చుట్టూ 4,200 పడకలతో నాలుగు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టడం జరుగుతోందని తెలిపారు. వరంగల్‌లో 24 అంతస్తులతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం రూ.1100 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నట్టు వివరించారు. జనగామ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసి రూ. 18.7‌‌0 కోట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. పాలకుర్తి ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. కేసీఆర్ కిట్,  కంటి వెలుగు, బస్తీ దవాఖానా, పల్లె దవాఖానా, ఆరోగ్య మహిళ, కేసీఆర్‌‌ న్యూట్రిషన్ కిట్స్, తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్ వంటి పథకాలతో రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ మార్చేందుకు సీఎం కేసీఆర్‌‌ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డీఆర్డీవో ప్రాజెక్ట్ డైరెక్టర్ రాంరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రశాంత్, డాక్టర్లు, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.