రిజర్వాయర్‌‌లో నీటి దొంగలు..

ముద్ర ప్రతినిధి, జనగామ: ‘రిజర్వాయర్‌‌లో నీటి దొంగలు..’ మీరు చదివింది నిజమే.. రిజర్వాయర్‌‌లో నీటిని దొంగతనం చేయడం ఏమిటని ఆశ్చర్యపోకండి.. అసలు కథ ఇది.. రాష్ట్రంలో అత్యంత కరువు ప్రాంతాలైన కొమురవెల్లి, చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట మండలాలకు సాగునీటిని అందించేందుకు కాంగ్రెస్‌ హయాంలో దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా 2007లో తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను నిర్మించారు. 3 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన ఈ రిజర్వాయర్‌‌ ద్వారా 65 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలనేది లక్ష్యం.

అయితే తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రిజర్వాయర్‌‌కు ఉత్తరాన అదనపు కాల్వ నిర్మించి కొండపాక మండలానికి  కూడా నీటిని తరలించారు. మొత్తం ఐదు మండలాల్లో కలిపి సుమారు 54 చెరువులను ఈ రిజర్వాయర్‌‌ నీటి ద్వారా నింపుతారు. అయితే రిజర్వాయర్‌‌లో చుట్టూ ఉన్న గ్రామాలకు చెందిన కొందరు ఇరిగేషన్ నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ శాఖ అధికారుల సహకారంతో అక్రమ కనెక్షన్లు పొంది రిజర్వాయర్ల లోని నీటిని తోడేస్తున్నారు.15 హెచ్‌పీ (హార్స్ పవర్) మోటార్లు వేసి రెండు మూడు కిలమీటర్ల దూరం వరకు నీళ్లను ఎత్తుకెళ్తున్నారు. దీంతో రిజర్వాయర్‌‌లో నీటి రోజురోజుకూ తగ్గుతోంది. అన్నీ తెలిసినా ఇరిగేషన్‌ శాఖ ఆఫీసర్లు మాత్రం ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు.