ఆత్మీయ సమావేశాలపై... కేసీఆర్ ఆదేశాలు బేకాతర్ .. కడియం సంచలన వ్యాఖ్యలు

ఆత్మీయ సమావేశాలపై... కేసీఆర్ ఆదేశాలు బేకాతర్ .. కడియం సంచలన వ్యాఖ్యలు

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: పార్టీ పటిష్టత, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు ధ్యేయంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే ఆత్మీయ సమావేశాలకు స్థానిక నాయకుల నుండి తనకు ఆహ్వానం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారని కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం రూ. 14 లక్షల 36 వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరినీ ఏకతాటిపై తీసుకువచ్చేందుకు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలను స్థానిక నాయకులు అతను చేయడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. 2014, 2018 సాధారణ ఎన్నికలతో పాటు రెండు పర్యాయాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరుకుతాను పనిచేసి అభ్యర్థుల గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశానన్నారు. స్థానిక నాయకుల తీరు వల్ల కార్యకర్తల్లో అయోమయం నెలకొందని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి విషయం పార్టీ అధిష్టానం సమీక్షిస్తుందన్నారు.

“కాంగ్రెస్, బిజెపి”లపై ధ్వజం
  కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలు చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలను టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కెసిఆర్ పై దుమ్మెత్తి పోయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్న ఇద్దరు నేతలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు తల వంపులు తెస్తూన్నారన్నారు. 2014లో 35 లక్షల 30 వేల మంది రైతులకు 16 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. 2018లో 5 లక్షల మంది రైతుల కి 400 కోట్లు రుణమాఫీ చేసిందన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో సాగు విస్తీర్ణంపెరిగి 65 లక్షల మెట్రిక్ టన్నుల నుండి మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి పెరిగిందన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం కోసం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలో ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందన్నారు. కొత్త సచివాలయానికి బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం, అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఇది కేవలం ముఖ్యమంత్రి కెసిఆర్ వల్లే సాధ్యమవుతుందన్నారు. ఆత్మీయ సమావేశాలతో పార్టీ శ్రేణుల్ని ఏకం చేసి గులాబీ జెండా ఎగరేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, బెలిదె వెంకన్న, బూర్ల శంకర్, చింతకుంట్ల నరేందర్ రెడ్డి, పోగుల సారంగపాణి, మామిడాల లింగారెడ్డి, భూక్య స్వామి నాయక్, భూక్య రాజేష్ నాయక్, సింగపురం జగన్, మారుజోడు రాంబాబు, అశోక్ బాబు, దశరథ్ నాయక్, జనగాం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.