నిందితులకు అధికార పార్టీ అండ

నిందితులకు అధికార పార్టీ అండ
  • బచ్చన్నపేటలో ఆందోళనకు దిగిన బంధువులు
  • నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌

ముద్ర ప్రతినిధి, జనగామ:  రిటైర్డ్ ఎంపీడీఓ రామకృష్ణయ్య ఆదివారం ఉదయం చంపక్ హిల్స్ శివారులోని క్వారీ గుంతలో శవమై కనిపించాడు. ఆయన హత్య వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నారని బంధువులు ఆరోపించారు. బచ్చన్నపేటలో జరుగుతున్న భూకబ్జాలను బయటపెడుతున్నాడనే అక్కసుతోనే తన తండ్రిని కిడ్నాప్‌ చేశారని రామకృష్ణయ్య కుమారుడు అశోక్‌ పేర్కొన్నారు. ఈ కిడ్నాప్‌ ప్రజాప్రతినిధుల హస్తం ఉందంటూ ఆరోపించారు. ఆయన ఆరోపణలు చేసిన మరుసటి రోజే చంపక్‌ హిల్స్‌ వద్ద రామకృష్ణయ్య మృత దేహం దొరకడం గమనార్హం. ఈ హత్యలో మండలానికి చెందిన కొందరు లీడర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మండల కేంద్రంలో ఇటీవల ఓ భూవివాదంలోకి రామకృష్ణయ్య వెళ్లడంతో పలువురు ఆయనపై కక్ష పెంచుకున్నారని అంటున్నారు. 

పోలీసుల నిర్లక్ష్యమే కారణమా!
రామకృష్ణయ్య కిడ్నాప్‌కు గురైనట్టు ఫిర్యాదు అందిన వెంటనే స్థానిక పోలీసులు స్పందించలేదని బంధువులు చెబుతున్నారు. డయల్‌100కు ఫోన్‌ చేయగా దాదాపు గంట తర్వాత ఘటన స్థలానికి వచ్చారని తెలిపారు. పోలీసులు సకాలంలో స్పందించి సెల్‌ ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా చేజ్‌ చేసి ఉంటే ఆయన ప్రాణాలతో దొరికే వాడేమోనని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. 
ఇక కిడ్నాప్‌పై స్థానిక జడ్పీటీసీ భర్త అంజయ్యపై అనుమానం ఉందని రామకృష్ణయ్య కుమారుడు అశోక్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సై ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యహరించారని బంధువులు వాపోయారు. పోలీసులు అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు బచ్చన్నపేట సెంటర్‌‌లో ఆదివారం రామకృష్ణయ్య కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ, ఎస్సైలను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

కఠిన చర్యలు తీసుకోవాలి
‘రిటైర్డ్‌ ఎంపీడీవో రామకృష్ణయ్య హత్యకు గురికావడం బాధాకరం. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారు ఎంత పెద్దవాళ్లయినా, ఏ పార్టీ వారైనా వదిలేది లేదు. పోలీసులు పూర్తి దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని  జనగామ ఎమ్మెల్యే  ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పోలీసులను కోరారు.