రోడ్ల నిర్మాణంతో రవాణా వ్యవస్థ పటిష్టం

రోడ్ల నిర్మాణంతో రవాణా వ్యవస్థ పటిష్టం
  • నాయకుల తప్పులు వ్యక్తిగతం
  • రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లాలోని పలు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని, దీంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ మరింత పటిష్టం అవుతుందని రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వ్యక్తిగతంగా ఎవరైనా  చిన్న చిన్న తప్పులు చేస్తే అవి వారి వ్యక్తిగతమే తప్ప  ప్రభుత్వ పరంగా మాత్రం తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజక వర్గం బీర్కూర్ మండల కేంద్రంతో పాటు బరంగెడ్గిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 

వాహనాలు పెరగడంతో రహదారులను కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు.బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో నాలుగు వరుసల రహదారిని డివైడర్‌, సెంట్రల్ లైటింగ్, సైడ్ డ్రైయిన్ తో నిర్మిస్తున్నట్లు చెప్పారు.ఇప్పటికే బాన్సువాడ, వర్ని, మోస్రా, చందూరు ల్లో పూర్తయ్యాయని అన్నారు. మెదక్-రుద్రూరు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రుద్రూరు, నస్రుల్లాబాద్ మండల కేంద్రాలలో కూడా ఫోర్ లైన్ నిర్మాణం అవుతుందని తెలిపారు.మద్నూర్ నుండి పోతంగల్ మీదుగా బోదన్ వరకు నూతనంగా జాతీయ రహదారి నిర్మాణానికి రూ. 470 కోట్ల నిధులు మంజూరు అయ్యాయన్నారు. అంతకు ముందు బీర్కూర్ మండల కేంద్రంలో  రూ. 7.20 కోట్లతో సెంట్రల్ లైటింగ్, డివైడర్‌, సైడ్ డ్రైనేజీ లతో నూతనంగా నిర్మించే ఫోర్ లైన్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.రూ. 1.10 కోట్లతో  బీర్కూర్ నుండి మల్లాపూర్ క్యాంపు మీదుగా టి టి డి వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు వేయనున్న సిసీ రోడ్డు, రూ. 10 లక్షలతో నిర్మించే మున్నూరు కాపు సంఘం ప్రహారి గోడకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాల్లో నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు,పాల్గొన్నారు