పారదర్శకంగా ఓటర్ల జాబితా

పారదర్శకంగా ఓటర్ల జాబితా
  • ఎలక్ట్రోల్ పరిశీలకులు డా. క్రిస్టినా జెడ్.చోంగ్తు
    కలెక్టర్ తో కలిసి పోలింగ్ కేంద్రాల సందర్శన 

ముద్ర ప్రతినిధి, మెదక్:తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించాలని  జిల్లా  ఓటరు జాబితా పరిశీలకులు (ఎలక్ట్రోరల్  అబ్జర్వర్ ) రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డాక్టర్  క్రిస్టినా జెడ్.చోంగ్తు  అన్నారు. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్  పరిధిలోని రెడ్డిపల్లి  ఉన్నత పాఠశాల,  మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్  పరిధిలోని దాయర పోలింగ్ కేంద్రాలను మంగళవారం సందర్శించారు. అనంతరం  మెదక్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎస్ఎస్ఆర్-2  స్వీప్  కార్యక్రమాలలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, జెండర్ రేషియో, పిడబ్ల్యూడి ఓటర్ నమోదుపై సమీక్షించారు.   జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన జరిగిన సమీక్షలో  ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, బిఎల్వోలు  వివిధ రాజకీయ పార్టీల  ప్రతినిధులు  పాల్గొన్నారు.   ఎలక్ట్రోల్ పరిశీలకులు డాక్టర్  క్రిస్టినా జెడ్.చోంగ్తు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు ఓటర్ నమోదు కోసం వచ్చిన దరఖాస్తులు అన్ని వెంటనే ఆన్లైన్ చేయాలన్నారు.

జాబితా రూపకల్పనలో అన్ని రాజకీయ పార్టీల నాయకుల సహకారం తీసుకొని తప్పులు లేని జాబితా రూపొందించాలని ఎన్నికల అధికారులకు సూచించారు. ఓటరు జాబితా రూపొందించే సమయంలో తప్పులు లేకుండా ఒకటికి రెండు సార్లు సరిచూసుకొని తప్పులు లేని జాబుతా రూపొందించడానికి బిఎల్వోలు సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు రిటర్నింగ్ అధికారులు కృషి చేయాలన్నారు. ఇప్పటివరకు  ప్రత్యేక శిబిరాలు ద్వారా  నూతన ఓటరు నమోదు కోసం ఫారం -6 ద్వారా వచ్చిన దరఖాస్తులు,  సవరణల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే జాబితాలో ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. జిల్లాలో 18-19 వయసుగల  కొత్త ఓటర్ల  పేర్లు జాబితాలో ఉన్నాయో,  లేవో,  ఓటర్ హెల్ప్లైన్ ఆన్లైన్ ద్వారా యువతరం  తమ ఓట్లను పరిశీలించుకునేలా    క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. జెండర్ రేషియో ప్రకారం మహిళా ఓటర్ల నమోదు జరిగిందో లేదో చూడాలన్నారు. జెండర్ రేషయోలో, పిడబ్ల్యుడి ఓటర్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  ప్రత్యేక శిబిరాలు, ఇతరాత్ర కార్యక్రమాల సందర్భంగా నేరుగా వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో అప్ లోడ్ చేసి, క్షేత్రస్థాయి పరిశీలన వెంట వెంట పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎండి నయీమ్,  ఎండి గౌస్ ఖురేషీ, ఎండి అఫ్జల్, మల్లేశం, గడ్డం శ్రీనివాస్, ఇస్రత్ ఆలీ, ఖలీక్ సిపిఐ తదితరులు పాల్గొన్నారు