ఉత్తమ్ నయా ఛాలెంజ్ 

ఉత్తమ్ నయా ఛాలెంజ్ 
  • మెజారిటీ 50 వేలు తగ్గితే రాజకీయ సన్యాసం
  • గత అసెంబ్లీ ఎన్నికల ముందూ ఇలాగే శపధం  
  • బీఆర్ఎస్​ గెలిస్తే గడ్డం తీయనంటూ సవాల్​

ముద్ర, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ మాజీ అధ్యక్షుడు,  నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి చాలెంజ్ విసిరారు.  ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కనీసం 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని వ్యాఖ్యానించారు.  ఇందులో ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రకటనతో ఉత్తమ్ అనుచర వర్గాలు ఒక్కసారిగా విస్మయానికి లోనయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఇదే విధంగా సవాల్ విసిరి....నవ్వుల పాలైన విషయం తెలిసిందే.  ఆ ఎన్నిక (2018)ల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తే తాను జీవితాంతం గడ్డం  తీయనంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీయే మళ్లీ విజయ ఢాంకా మ్రోగించింది. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డంపై సీఎం కేసీఆర్ , మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు పలుమార్లు పంచ్ లు వేశారు.  ఇక అసెంబ్లీ సమావేశాల్లో అయితే కాంగ్రెస్ శాసనసభ్యులను ఉత్తం గడ్డపై అధికార పార్టీ  ఒక ఆటాడుకున్నది.  ప్రస్తుతం ఆ  గడ్డం గురించి ఇప్పుడుప్పుడే అందరు మరిచిపోతున్న సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సారి రాజకీయ సన్యాసం గురించి సవాల్ చేశారు.  

ఇదే అంశంపై ప్రస్తుతం  సోషల్ మీడియాలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిపై భలే  సెటైర్లు పేలుతున్నాయి.  ఆయన గెలువకపోతే రాజకీయ సన్యాయం తీసుకుంటాననో  లేక కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే  రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్  చేస్తే మంచిదే కానీ..... ఇలా 50వేల భారీ మెజార్టీలో ఒక్క ఓటు తగ్గినా సన్యాసం  తీసుకుంటానని ఉత్తమ్ చేసిన సవాల్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.  ఈ ఎన్నికల్లో  ఒక వేళ ఉత్తమ కుమార్ రెడ్డి గెలువడమే కాకుండా,  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ,   50 వేల మెజార్టీ రాకపోతే మాత్రం మళ్లీ ఆయనపై మళ్లీ సెటైర్లు వర్షం కురవడం ఖాయమని తెలుస్తోంది.  మొత్తం మీద మన ఉత్తమన్న విసిరిన చాలెంజ్ తో మరోసారి వార్తల్లో  ప్రముఖంగా నిలిచినట్లు అయింది. 

నల్గొండలో మంగళవారం ఉత్తమ్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో చేరే వారికి సముచిత స్థానమని కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందరినీ కలుపుకుని ముందుకు సాగి, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఆయన పేర్కొంటూ.... పై విధంగా విధంగా వ్యాఖ్యలు చేశారు.