26న ఏడుపాయల్లో ఆధ్యాతిక నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు- కలెక్టర్ రాజర్శి షా ఆదేశం

26న ఏడుపాయల్లో ఆధ్యాతిక నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు- కలెక్టర్ రాజర్శి షా ఆదేశం

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయ ప్రాంగణంలో ఈ నెల 26న పరంపర సౌజన్యంతో నిర్వహించే  శ్రీదేవి నృత్యాలయ ఆధ్యాతిక నృత్య ప్రదర్శనకు ముమ్మర ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులకు సూచించారు.

గురువారం కార్యక్రమ నిర్వహణపై అధికారులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక, వైద్య శాఖామంత్రి హరీష్ రావు ఆదేశాలమేరకు పరంపర సౌజన్యంతో జిల్లా యంత్రాంగం ద్వారా ఏర్పాటు చేస్తున్న ఈ నృత్య ప్రదర్శన విజయవంతమయ్యేలా విధులు కేటాయించిన అధికారులందరు సమిష్టిగా, సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు కొనసాగుతుందని, ఇట్టి కార్యక్రమానికి రాష్ట్ర ఆర్ధిక,వైద్య ఆరోగ్య శాఖామంత్రితో పాటు  శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషద్ చైర్ పర్సన్, మహిళా కమీషన్ చైర్ పర్సన్, ఆలయ చైర్మన్ తదితరులు పాల్గొంటారన్నారు. సాయంత్రం 5.30 గంటలలోగా వచ్చేలా పర్యవేక్షించాలని, అందుకనుగుణంగా చక్కటి స్టేజి, లైటింగ్  ఏర్పాటు చేయాలన్నారు. సుమారు వంద మంది వి.ఐ.పిలతో పాటు  అధికారులు,  ప్రెస్, విద్యార్థిని విద్యార్థులు, మహిళా  సంఘ సభ్యులు తదితరులు  వేయి మందికి పైగా వస్తారని, అందుకనుగుణంగా  కార్యక్రమాలను తిలకించే విధంగా  ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసి కుర్చీలు వేయాలని  ఆర్.డి.ఓ. సాయిరాం, ఆలయ ఈఓ శ్రీనివాస్ లకు సూచించారు. స్వయం సహాయక సంఘ సభ్యులను సమీకరించవలసినదిగా డిఆర్డిఓను, 8,9వ తరగతి  విదార్థులను సమీకరించవలసినదిగా డి.ఈ.ఓ. కు, విద్యుత్ లో అంతరాయం లేకుండా చూడవలసినదిగా విద్యుత్ ఎస్.ఈకి, కార్యక్రమాలను వీక్షించే వారికి వాటర్ బాటిళ్లను అందించాలని మిషన్ భగీరథ అధికారికి, రోప్ పార్టీ, వెహికల్స్ పార్కింగ్, బందోబస్త్ ఏర్పాటు చూడవలసినదిగా డిఎస్పీకి సూచించారు. 15 బస్సులు సమకూర్చి డిఆర్డిఓ  కు అందజేయవలసిందిగా జిల్లా రవాణాధికారికి సూచించారు. ఇటీవలే ఏడుపాయల జాతరను ఘనంగా నిర్వహించుకున్నామని, అదే స్పూర్తితో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాని విజయవంతం చేసేలా చక్కటి ప్రణాళికతో ముందుకు సాగాలని, సమయం తక్కువగా ఉన్నందున త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్,  పరంపర ప్రతినిధి శశి, ఆర్.డి.ఓ. సాయి రామ్, జిల్లా అధికారులు, తహసీల్ధార్లు పాల్గొన్నారు.