నిఘా నేత్రాల నేల చూపులు

నిఘా నేత్రాల నేల చూపులు

భూదాన్ పోచంపల్లి,ముద్ర:- దొంగతనాలు ,రహదారి ప్రమాదాలు ,అక్రమ రవాణా తదితర ఘటనలకు సంబంధించి నిందితులను త్వరగా గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఒక్క సీసీ కెమెరా 100 పోలీసులతో సమానం అంటారు. కానీ ప్రపంచ పర్యాటక ప్రాంతంగా పెరిగించిన భూదాన్ పోచంపల్లి పట్టణంలో ఒక్క సీసీ కెమెరా చూద్దామన్నా జాడే లేకుండా పోయింది. మండలంలో నేరాల నియంత్రణకు దాతల సహకారంతో పోలీసు శాఖ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో అలంకారప్రాయంగా మారాయి. మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలకు అమర్చిన రెండు నిఘానేత్రాలు నేల వైపు వాలిపోయాయి. భూదాన్ పోచంపల్లి పట్టణంలో పాటు 22 గ్రామాలలోని ముఖ్య కూడళ్లలో పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

అప్పట్లో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు రోడ్డు విస్తరణలో భాగంగా పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ పరిధిలో తప్ప ఎక్కడ సిసి కెమెరాలు కనిపించడం లేదు. ప్రపంచ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన భూదాన్ పోచంపల్లికి దేశ విదేశీయుల సైతం వస్తుంటారు. కానీ మారుతున్న కాలానుగుణంగా నేరాలు, దొంగతనాలు ఎక్కువైతున్నప్పటికీ పట్టణ కేంద్రంలో ఒక్క సీసీ కెమెరా కూడా కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రధాన చౌరస్తాలో సిసి కెమెరాలు లేకపోవడంతో దొంగతనాలు వంటి ఘటనలు చేదించడం ఆలస్యం అవుతుంది. అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలలో అక్రమ డబ్బు రవాణా చేయడం ఓటర్లను పలోభాలకు గురి చేస్తే గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని, పాడైన నిఘా నేత్రాలను మరమ్మతులు చేసి, నిఘా నేత్రాలను పునరుద్ధరిస్తే బాగుంటుందని స్థానికులు  కోరుతున్నారు.