చక చక సాగుతున్న వేయి పడకల ఆసుపత్రి నిర్మాణం

చక చక సాగుతున్న వేయి పడకల ఆసుపత్రి నిర్మాణం
  • ఆగస్టు నాటికి సిద్ధం  చేస్తున్న అధికారులు
  • మంత్రి హరీష్ రావు ఇలాకలో ప్రజలకు ఇక అన్ని రకాల వైద్య సేవలు
  • రూ. 266 కోట్ల వ్యయంతో భారీ ప్రాజెక్ట్

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: సిద్దిపేటలో వేయి పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.  ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఇలాకలో ప్రజలకు ఇక అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు నాటికి  ఆసుపత్రి  భవన నిర్మాణం పూర్తయి ప్రారంభం కానుంది.  ప్రభుత్వ మెడికల్ కళాశాల, దానికి అనుబంధంగా వేయి పడకల హాస్పిటల్ సిద్దిపేటలోని కోమటి చెరువు ముందు భాగాన చేపట్టారు. సుమారు 28 ఎకరాల విశాలమైన స్థలంలో ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.  మంత్రి హరీష్ రావు అటు కళాశాల ఇటు వైద్యశాల పనులు చేపట్టి దీన్ని" మెడికల్  హబ్" గా తీర్చిదిద్దారు. నియోజకవర్గంలో తనదైన ముద్రను వేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం మొదట 15 ఎకరాల విశాలమైన స్థలంలో 135 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ మెడికల్ కళాశాలను సర్వాంగ సుందరంగా, సకల సదుపాయాలతో నిర్మించి ముఖ్యమంత్రి కెసిఆర్ చే ప్రారంభింపజేశారు. ఇప్పుడు 266 కోట్ల రూపాయలు వెచ్చించి దానికి అనుబంధంగా వేయి పడకల హాస్పిటల్ నిర్మిస్తున్నారు.  తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫాస్ట్ట్రక్చర్స్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (టీఎస్ ఎంఎస్ఐడిసి) ద్వారా చేపట్టిన ఈ భవన నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి.13 ఎకరాల విశాలమైన స్థలంలో జి ప్లస్ ఫైవ్ అంతస్తులు, 7,07,338  చదరపు అడుగుల వెడల్పుతో  ఈ భవన నిర్మాణం చేపట్టారు. 11 డిపార్ట్మెంట్స్ అడ్మినిస్ట్రేషన్ గదులు , 11 రకాల చికిత్స లకు వైద్య సేవలు అందించే గదులు, ఆపరేషన్ థియేటర్లు, పేషంట్లకు ప్రత్యేక రూములు, నిర్మిస్తున్నారు. విశాలమైన కారిడార్స్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు రెసిడెంట్ డాక్టర్లు ,నర్సుల కోసం మరో రెండు హాస్టల్స్ నిర్మిస్తున్నారు. పలు చోట్ల నుంచి లిఫ్ట్లు, మెట్లు ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. ఆక్సిజన్ ప్లాంట్, మార్చురీ వార్డులు. బయో మెడికల్ వేస్ట్ ప్లాంట్, వాటర్ ట్యాంక్,వాటర్ సంపులు సెక్యూరిటీ రూములు, షాపింగ్ కాంప్లెక్స్, పార్కింగ్  సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు.. పనులు ఆగస్టు నాటికి పూర్తి చేసి ఆసుపత్రిని ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని మంత్రి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు దీంతో ప్రతినిత్యము ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

సిద్దిపేటలోనే  ఇక అన్ని వైద్య సేవలను అందిస్తా. -వైద్యశాఖమంత్రి హరీష్ రావు.

సిద్దిపేట పట్టణం వేగంగా విస్తరిస్తున్నది. ఈ జిల్లాలో వైద్య అవసరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రజలకు ఏ ఏ రకాల వైద్యం అవసరం ఉంటుందో గుర్తించాము. రోగులందరికీ నాణ్యమైన వైద్యం వేగంగా అందేందుకు వేయిపడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నాం. ఇన్నాళ్లుగా రోగులు కార్పొరేట్ వైద్యం కోసం హైదరాబాదుకు వెళ్లి అక్కడే వారం రోజుల పాటు ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఖర్చులు విపరీతంగా అవుతున్నాయి.ఆర్థిక స్తోమత లేనివారు గాంధీ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. వీటన్నింటినీ పరిగణలు తీసుకొని భవిష్యత్తు తరాల అవసరాలను గుర్తించి సిద్దిపేటలోనే ఈ భారీ ప్రాజెక్టును చేపట్టిన.. మెడికల్ కళాశాల ఏర్పాటు వల్ల అటు డాక్టర్లను తయారు చేయడం , హాస్పిటల్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడే రోగులందరికీ వైద్యం అందించడం జరుగుతుంది. వైద్య సేవల విషయంలో నిశ్చింత పడకుండా ప్రజలందరూ ఇక హాయిగా ఉండేలా ఈ హాస్పిటల్ అందుబాటులోకి వస్తుంది.