గురునానక్ యూనివర్సిటీ విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్ధకం | Guru Nanak University Students is questionable

గురునానక్ యూనివర్సిటీ విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్ధకం | Guru Nanak University Students is questionable
  • ఏడాది విద్యా సంవత్సరం కోల్పోనున్న నాలుగు వేల మంది విద్యార్థులు
  • యూనివర్సిటీ అనుమతులు రాకుండానే అడ్మిషన్లు
  • ఒక్కో సీటు కోసం రూ.3 లక్షల ఫీజులు వసూలు
  • అనుమతులు రావని తెలిసి చేతులెత్తేసిన యాజమాన్యం
  • కొనసాగుతున ఆందోళనలు


ఇబ్రహీంపట్నం, ముద్ర: ఇబ్రహీంపట్నం గురునానక్ కళాశాలలో ప్రైవేటు యూనివర్సిటీ పేరిట అడ్మిషన్ పొందిన విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కాలేజీలో యూనివర్సిటీ కోర్సుల కోసం లక్షల రూపాయలు ఫీజు వసూలు చేసి.. ఇప్పుడు అనుమతి లేదంటూ యాజమాన్యం చేతులెత్తేసింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన విద్యార్థులు వందల మంది వారి తల్లిదండ్రులలో కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. కళాశాల యాజమాన్యం అనుమతులు రావని తెలిసి విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి చావు కబురు చల్లగా చెప్పింది. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని కళాశాల ముందు బైఠాయించారు. గురునానక్ కాలేజీ యూనివర్సిటీ పేరుతో మోసం చేసిందని.. యాజమాన్యం చేసిన పని వల్ల ఏడాది విద్యా సంవత్సం కోల్పోయామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామంటూ కాలేజీ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలోనే పోలీసులు జోక్యం చేసుకొని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు.. ఆందోళన విరమించాలని.. యాజమాన్యంతో చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. దీనికి ఆందోళనకారులు ససేమిరా అనటంతో.. లాఠీలకు పని చెప్పారు పోలీసులు. బలవంతంగా అక్కడి నుంచి తరిమికొట్టారు. లాఠీఛార్జి చేసి ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు.

పోలీసులు వైఖరిపైనా విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులకు న్యాయం చేయాల్సిన పోలీసులు.. బాధితులపైనే లాఠీఛార్జీ చేస్తారా అంటూ నిలదీస్తున్నారు. రూ. లక్షలకు లక్షలు ఫీజు రూపంలో డబ్బులు కట్టామని.. ఇప్పుడు యూనివర్సిటీ హోదా లేదని.. కోర్సులకు అనుమతి లేదని చెప్పటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. న్యాయం చేయాల్సిందే అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు.

యూనివర్సిటీ బిల్లు ఆమోదం లేకుండా..

వేసవి అసెంబ్లీ సమావేశాల్లో 5 ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు బిల్లుకు ఆమోద ముద్ర లభించింది. గవర్నర్‌ ఆమోద ముద్ర వేస్తేనే చట్ట రూపం దాల్చినట్లు. గవర్నర్‌ ఆమోదించక పోగా.. సుదీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టింది. పెండింగ్‌ బిల్లులపై ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. గవర్నర్‌ బిల్లును ఆమోదించకపోగా.. అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ తిప్పి పంపింది. అసెంబ్లీలో బిల్లు పాసైన వెంటనే ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్‌ కాలేజీ యాజమాన్యం సహా ఇదే ప్రాంతంలోని మరో ఇంజినీరింగ్‌ కాలేజీ కూడా గుర్తింపు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఆర్థిక వనరులతో పాటు ప్రభుత్వ పెద్దల అండదండలు వీరికి ఉండడంతో తమ కాలేజీకి గుర్తింపు వచ్చి తీరుతుందని భావించింది. అసెంబ్లీ రూపొందించి గవర్నర్‌కు పంపిన బిల్లు చట్ట రూపం దాల్చక ముందే కొత్త యూనివర్సిటీ పేరుతో 2022–23 విద్యా సంవత్సరానికి 4 వేలకు పైగా అడ్మిషన్లు చేపట్టింది. ఇప్పటికే రూ. లక్షలు చెల్లించి కాలేజీలో అడ్మిషన్ తీసుకొని, క్లాసులకు హాజరవుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

ఒక్కో సీటు కోసం రూ.3 లక్షల ఫీజులు వసూలు

గురునానక్ ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. రాజకీయ, ఆర్థిక పలుకుబడి కలిగిన యాజమాన్యం యూనివర్సిటీ గ్రాండ్స్‌ కమిషన్‌ నుంచి ఎలాంటి అనుమతులు రాకముందే విద్యార్థుల నుంచి అడ్మిషన్లు తీసుకుంది. రెగ్యులర్‌ విద్యార్థులకు సమానంగా తొమ్మిది నెలల నుంచి తరగతులు నిర్వహించింది. మార్కెట్‌లో గుర్తింపు పొందిన కాలేజీ కావడంతో విద్యార్థులు ఏమీ ఆలోచించకుండా అడ్మిషన్లు తీసుకున్నారు. ఒక్కో సీటుకు రూ.3 లక్షలకు పైగా విద్యార్థులు ఫీజు చెల్లించారు. రెగ్యులర్‌ విద్యార్థులకు ఇప్పటికే ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షలు పూరైతే.. రెండో సెమిస్టర్‌కు సిద్ధమవుతున్నారు. కానీ ఇదే క్యాంపస్‌లో నిర్వహించనున్న ప్రైవేట్ యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు మాత్రం ఇప్పటికీ సెమిస్టర్‌ పరీక్షలకు నోచుకోలేదు. మరో నెలలో విద్యా సంవత్సరం ముగుస్తోంది. ఇప్పటి వరకు యూనివర్సిటీకి అనుమతులు రాకపోవడంతో అడ్మిషన్లు పొంది.. తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు తమ భవిష్యత్తు ఏంటో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

గురునానక్ కళాశాల చుట్టూ పోలీసుల పహారా..

గురునానక్ యూనివర్సిటీ కి అనుమతులు రాకపోవడంతో వేలాదిమంది విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోయే పరిస్థితి దాపురించింది. విద్యార్థుల నుండి ఆందోళనలు వ్యక్తమవుతాయన్న విషయాన్ని ముందే గ్రహించిన యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. రాజకీయ పలుకుబడితో స్థానిక పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి కళాశాల చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయించింది. స్థానిక ఏసిపితోపాటు ముగ్గురు సిఐలు ఎస్సైలు వందలాదిమంది కానిస్టేబుల్ లతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థులు వారి తల్లిదండ్రులపై లాఠీచార్జికి దిగారు. దీంతో వివిధ రాజకీయ పక్షాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అనుమతులు లేకున్నా అడ్మిషన్లు తీసుకున్న కళాశాలపై చర్యలు తీసుకోవడంకన్నా ఆందోళన చేస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులపై పోలీసులు విరుచుకుపడడంపై మండిపడుతున్నాయి. 

విద్యార్థులకు సర్టిఫికెట్లు తిరిగిచ్చేయండి..

గురునానక్‌ వర్సిటీలో (జిఎన్ యు) ప్రవేశాలు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లను తిరిగి ఇచ్చేయాలని యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ వర్సిటీకి నోటీసులు జారీచేశారు. గురునానక్‌ వర్సిటీ ఏర్పాటు చేస్తూ గతంలో అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో వర్సిటీ వర్గాలు విద్యార్థులను చేర్చుకొన్నాయి. గవర్నర్‌ బిల్లును ఆమోదించకపోవడంతో వర్సిటీ ఏర్పాటుకాలేదు. ఇలా ఏడాది గడిచిపోగా, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారికి సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వాలని సూచించింది. అయితే సర్టిఫికెట్లు తిరిగిస్తే విద్యార్థుల ఏడాది విద్యా సంవత్సరం ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వారు ఏడాది విద్యా సంవత్సరం కోల్పోవాల్సిందేనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.