రేగొండ బీఆర్‌ఎస్‌లో ముదురుతున్న ఆధిపత్యపోరు

రేగొండ బీఆర్‌ఎస్‌లో ముదురుతున్న ఆధిపత్యపోరు
  • ఈసారి టిక్కెట్‌ లేదని పార్టీ పెద్దలు చెప్పినా…
  • ఆ ఎమ్మెల్సీ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారా? 
  • సిట్టింగ్‌ ఎమ్మెల్యేని ఢీ కొట్టేలా బలప్రదర్శన చేస్తున్నారా? 
  • పార్టీ ముఖ్యనేత మాటల్ని కూడా పట్టించుకోని ఆ ఎమ్మెల్సీ ఎవరు?
  • అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు?
  • రేగొండ బీఆర్‌ఎస్‌లో అధిపత్యపోరు ముదురు పాకాన పడింది. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా తయారైంది వ్యవహారం. 

ముద్ర న్యూస్ రేగొండ:-2014 ఎన్నికల్లో సిరికొండ మధుసూదనాచారి భూపాలపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీ స్పీకర్‌గా పని చేశారు. కానీ.. 2018 ఎన్నికల్లో ఓడిపోయారాయన. దీంతో అప్పటి నుంచి నియోజకవర్గం మీద ప్రత్యేకంగా దృష్టిపెట్టి… పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. సెగ్మెంట్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన గండ్ర వెంకట రమణారెడ్డి 2019లో కారెక్కారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటిదాకా నియోజకవర్గంలో గులాబీ పార్టీకి కేరాఫ్‌గా ఉన్న తన స్థానంలోకి సిట్టింగ్‌ ఎమ్మెల్యే వచ్చేసరికి తట్టుకోలేకపోయారు. చారి ఇంకేముంది… రేగొండలో యధావిధిగా గ్రూప్‌వార్‌ మొదలైంది. చారి ఎమ్మెల్సీ అయినా… ఈసారి టిక్కెట్‌ కోసం గట్టిగా ప్రయత్నిస్తుండటంతో ఆధిపత్యపోరు పీక్స్‌కు చేరింది.

భూపాలపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్…. ఈ ఆధిపత్య పోరును దృష్టిలో ఉంచుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన సిరికొండకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు. మరో ఐదేళ్లపాటు ఆయన ఎమ్మెల్సీగానే కొనసాగుతారని.. ఎమ్మెల్యే అభ్యర్థిగా గండ్ర రమణా రెడ్డి ఉంటారని బహిరంగ సభలోనే క్లారిటీ ఇచ్చేశారు. అంతే కాదు.. గండ్రను మళ్ళీ గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ మాటలతో లోలోపల రగిలిపోయారట మధుసూదనాచారి  అనుచరులు. విషయాన్ని స్వయంగా కేటీఆర్‌ స్పష్టంగా చెప్పినా చారి మాత్రం.. తన ప్రయత్నాలను ఆపలేదు నియోజ‌క‌వ‌ర్గంలోని ద్వితీయ శ్రేణి నేత‌లు త‌న వ‌ర్గం నుంచి జారిపోకుండా చర్యలు తీసుకుంటూ బలప్రదర్శన ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. కేటీఆర్ కామెంట్స్ చేసిన 10 రోజుల్లోనే 70 కార్ల భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్‌ నుంచి భూపాలపల్లి పర్యటనకు వచ్చారాయన. హంగూ.. ఆర్భాటంతో కోటంచ గుడికి వచ్చి తాను టిక్కెట్‌ రేస్‌లో ఉన్నానని చెప్పకనే చెప్పారు. ఎమ్మెల్యే గండ్రకు భూపాలపల్లిలో ఎదురుగాలి వీస్తోంద‌న్న సర్వే రిపోర్ట్స్‌ని తెర మీదకు తెస్తూ… కేసీఆర్‌తో త‌న‌కున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని తిరిగి యాక్టివ్‌ అయ్యారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అనుచ‌రుల ఆగ‌డాల‌తో, చిట్యాల‌, రేగొండ మండ‌లాల్లో తీవ్ర వ్యతిరేక‌త ఉన్నట్లు తెర మీదకు తెచ్చి గ‌త కొంత‌కాలంగా ప్రచారం చేస్తోంది మాజీ స్పీకర్‌ వర్గం. నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ…వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ త‌న‌కే వ‌స్తుంద‌ని అనుచ‌రుల‌తో చెబుతున్నారని. సమాచారం  అంతే కాదు… భూపాలపల్లిలో మధుసూదనాచారి క్యాంపు ఆఫీసు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టడం ద్వారా టికెట్ రేసు నుండి తప్పుకోలేదని కేడర్‌కి బలమైన సంకేతాలు పంపుతున్నారట. ఎమ్మెల్యే గండ్ర అనుచురులు మాత్రం మంత్రి పదవి పైన కన్నేసిన చారి సాబ్ కావాలనే ఈ హడావిడి చేస్తున్నారని అంటున్నారు. ఎమ్మెల్యే వర్సెస్‌ ఎమ్మెల్సీగా మారిన భూపాలపల్లి రాజకీయం ఏ టర్న్‌ తీసుకుంటుదో చూడాలి. తాజాగా బుధవారం రోజు రేగొండ మండలం కోటంచ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు చారి అనుచరులు చారికి టిక్కెట్ ఇవ్వాలని లెనోచో భూపాల్ పల్లి నియోజకవర్గ స్థాయిలో ఆందోళనలు చేస్తామని తెలిపారు.